హంద్రీ-నీవా రక్షణ యాత్రకు వైఎస్సార్ సీపీ పిలుపు

నేడు న్యామద్దల నుంచి ప్రారంభం

రైతులు, ప్రజలు భారీగా పాల్గొనాలని విజ్ఞప్తి

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: హంద్రీ-నీవా రెండో దశ కాలువ పనుల్లో జరిగిన అక్రమాలు, నాణ్యత లోపాలను ప్రజలకు వివరించి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైఎస్సార్సీపీ రాయలసీమ ప్రాజెక్టుల టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో గురువారం “హంద్రీ-నీవా రక్షణ యాత్ర” నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాయలసీమ జోనల్ అధికార ప్రతినిధి కె.వి. రమణ తెలిపారు. ఈ యాత్ర శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దల గ్రామం నుంచి ప్రారంభం కానుంది. రైతులు, మేధావులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్ర స్థాయి ప్రాజెక్టుల టాస్క్‌ఫోర్స్ నాయకులు, సాంకేతిక నిపుణులు, వివిధ నియోజకవర్గాల ఇన్‌చార్జులు, జిల్లా పార్టీ నాయకులు ఈ యాత్రలో పాల్గొంటారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీ-నీవా మొదటి దశ వెడల్పు పనులు, రెండో దశ లైనింగ్ పనుల కోసం సుమారు రూ.3,850 కోట్లు, అనంతరం వివిధ ప్యాకేజీల కింద మరో రూ.2,000 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నప్పటికీ, ఆ వ్యయానికి అనుగుణంగా రైతులకు ఎంత మేర ప్రయోజనం చేకూరిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించారా, టెండర్లలో అధిక ధరలు ఎందుకు చెల్లించారో, ఏడాది కూడా పూర్తికాకముందే దెబ్బతిన్న పనులకు మళ్లీ నిధులు ఎందుకు కేటాయించారో వంటి అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజల ముందుంచడమే యాత్ర ఉద్దేశమని కె.వి. రమణ తెలిపారు. హంద్రీ-నీవాతో పాటు గ్రేటర్ రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిపై కూడా అధ్యయనం చేసి, రైతుల అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు వెల్లడించారు.