టీడీపీతోనే మహిళల అభ్యున్నతి సాధ్యం

టీడీపీతోనే మహిళల అభ్యున్నతి సాధ్యం

పుట్టపర్తి ఆంధ్రప్రభ: మహిళల అభ్యున్నతి, సాధికారత తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన నేపథ్యంలో శనివారం మహిళలతో కలిసి స్థానిక బస్టాండ్ నుంచి సత్యమ్మ గుడి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు.

అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే మహిళా సాధికారత లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలు బలోపేతం కావాలనే సంకల్పంతో పార్టీ ముందుకు సాగుతోందని చెప్పారు.

మహిళల విద్యాభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మహిళా విశ్వవిద్యాలయాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించడం ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు.

దీపం పథకం ద్వారా మహిళల ఆరోగ్య పరిరక్షణకు చంద్రబాబు నాయుడు కృషి చేశారని, ప్రస్తుతం ప్రతి ఏడాది మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని తెలిపారు.

‘తల్లికి వందనం’ పథకం ద్వారా కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉన్నా ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కల్పిస్తున్నామని చెప్పారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది తల్లుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సహాయం జమ చేయనున్నట్లు వివరించారు.

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొస్తూ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని పేర్కొన్నారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడుతున్నాయని అన్నారు.

స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్, శ్రీశక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి కార్యక్రమాలు మహిళా సంక్షేమానికి నిదర్శనమని చెప్పారు. రానున్న రోజుల్లో మహిళలు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా మరింతగా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

మహిళలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ మెరుగైన భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.

అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి అధికారులకు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply