ఉపాధ్యాయుడిగా మారిన ఐటీడీఏ పీవో

తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు చెప్పి బోధన ప్రమాణాలు పరిశీలన

జైనూర్, ఆంధ్రప్రభ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మధ్య బుధవారం ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీవో) మంద మకరంద్ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో పర్యటించారు.

మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 6వ, 9వ తరగతి గదులను సందర్శించి ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న బోధనను విద్యార్థులతో కలిసి కూర్చొని పరిశీలించారు. విద్యాబోధన ప్రమాణాలపై వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం పీవో స్వయంగా ఉపాధ్యాయుడిగా మారి బోర్డుపై రాస్తూ విద్యార్థినులకు పాఠాలు బోధించారు. పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగి వారి అభ్యాసాన్ని పరీక్షించారు. విద్యార్థినులు సరైన సమాధానాలు చెప్పడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు పార్వతి, ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా నాణ్యమైన బోధన అందించాలని సూచించారు. అలాగే విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు పార్వతి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.