నీళ్లపై ప్రభుత్వాన్ని నిలదీసిన నిరంజన్‌రెడ్డి

మిషన్ భగీరథపై కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన బీఆర్‌ఎస్
వర్షాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శ
వర్షాలు లేకపోతే ఏపీలో వరి ఎలా సాగైంది?..
రేవంత్ సర్కారును ప్రశ్నించిన నిరంజన్‌రెడ్డి

హైద‌రాబాద్‌, ఆంధ్రప్రభ : ఎల్‌నినో ప్రభావం, వర్షాభావం పేరుతో తెలంగాణలో వరి సాగును నిరుత్సాహపరుస్తున్న ప్రభుత్వం.. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో రైతులు భారీగా వరి సాగు చేస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరాపైనా ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుబట్టారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావం పేరుతో తెలంగాణలో రైతులను వరి సాగుకు దూరం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వర్షాలు లేకపోతే ఆంధ్రప్రదేశ్‌లో రైతులు పెద్దఎత్తున వరి సాగు ఎలా చేశారని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణకు ఎగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో రైతులు నీటి లభ్యతపై నమ్మకంతో వరి సాగు చేస్తున్నారని, అక్కడి ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం చివరికి నీటిని దిగువకు విడుదల చేస్తుందనే విశ్వాసం ఉందని వ్యాఖ్యానించారు. “తెలంగాణ ప్రజల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఎక్కువ నమ్మకం ఉంది. ఎలాగైనా నీటిని దిగువకు వదులుతారనే నమ్మకంతోనే వారు వరి సాగు చేస్తున్నారు” అని అన్నారు.

‘నాలుగు టీఎంసీలతో వేల ఎకరాలకు సాగునీరు’
నాలుగు రోజుల ఆలస్యమైనా నాలుగు టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసే పరిస్థితి వస్తుందని, ఆ నీటితో సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

మిషన్ భగీరథపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి
ఒక్క చుక్క వర్షం కూడా పడకపోయినా వచ్చే ఏడాది జూన్‌, జులై వరకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని సంబంధిత ఇంజినీర్లు చెప్పారని ఆయన తెలిపారు. అలాంటప్పుడు వర్షాభావాన్ని కారణంగా చూపుతూ తాగునీటి సరఫరాలో సమస్యలు ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు.

‘ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు’
మిషన్ భగీరథ ద్వారా సక్రమంగా నీటి సరఫరా చేయడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే వర్షాలు పడలేదనే కారణాన్ని చూపుతున్నారని నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ మంత్రుల చేతకానితనం, అవగాహనలేమి వల్లే ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నారని విమర్శించారు.