భారీ వర్షాల వేళ అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

వాగులు, వంకలు దాటొద్దు.. అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి

జగిత్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జగిత్యాల నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సూచించారు.

బుధవారం ఆయన మాట్లాడుతూ వాగులు, వంకలు, చెరువులు, కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్న ప్రాంతాల్లోకి వెళ్లే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. అలాగే విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగల దగ్గరకు వెళ్లకుండా వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

వర్షాల కారణంగా శిథిలావస్థలో ఉన్న గోడలు, పాత భవనాలకు దూరంగా ఉండాలని సూచించారు. చిన్నారులను ఒంటరిగా బయటకు పంపవద్దని, తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

రైతులు ఉరుములు, మెరుపులు సంభవిస్తున్న సమయంలో పొలాల్లో పనులు చేయకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. వాహనదారులు నీటితో నిండిన రహదారులపై వేగంగా ప్రయాణించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు.

ప్రభుత్వం, వాతావరణ శాఖ, జిల్లా అధికార యంత్రాంగం జారీ చేసే అధికారిక హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే సూచించారు.

అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదం జరిగినా లేదా సహాయం అవసరమైనా స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ, మున్సిపల్ అధికారులు, జిల్లా యంత్రాంగం, పోలీసు, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ అధికారులకు వెంటనే సమాచారం అందించాలని ఆయన కోరారు.