పొంగిపొర్లిన వాగులు..

నిండిన చెరువులు, కుంటలు

జన్నారం,ఆంధ్రప్రభ: కురిసిన చెడివాన.. మురిసిన రైతన్న..! బుధవారం తెల్లవారు నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు,కుంటల్లో భారీగా వాన వరద నీరు చేరి నిండుకుండలను తలిపిస్తున్నాయి.రైతన్నలు సంతోషంతో పొలాల వైపు పరుగులు తీశారు.ఇప్పటికే మండలంలోని కొంతమంది రైతులు విద్యుత్తు మోటర్లు ఉన్న బావుల కింద నాట్లు వేశారు.జన్నారం మండలంలోని మొర్రిగూడ, పొనకల్,మహ్మదాబాద్ పెద్దవాగులు రెండు గట్లను తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

మండలంలోని 29 గ్రామపంచాయతీలో సుమారు 24వేల ఎకరాల్లో వరి,పత్తి, మిర్చి,మొక్కజొన్న, ఇతర పంటను వేయనున్నారు. ఇందులో 18వేల ఎకరాల్లో విద్యుత్ మోటర్లు ఉన్న బావులు, చెరువులు,కుంటల కింద ఈ ఖరీఫ్ సీజన్లో వరి పంటను వేస్తారు. ప్రస్తుతం విద్యుత్ మోటార్ల బావుల కింద 5వేల ఎకరాల్లో వరి పంటను వేశారు. ఇప్పటికీ 6 వేల ఎకరాల్లో పత్తి, మిర్చి, మొక్కజొన్న,ఇతర ఆరుతడి పంటలను రైతులు వేశారు.ఈ ప్రాంత రైతాంగం కడెం ప్రాజెక్టు సాగునీరుపై ఎక్కువగా వరి పంటను సాగు చేస్తూ వస్తున్నారు.ప్రస్తుతం భారీగా కురుస్తున్న వర్షాలకు కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి సాగునీరు వస్తుందని పలువురు రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.