Education | పేద విద్యార్థుల చదువు, నైపుణ్య శిక్షణకు ట్రస్ట్ అండగా ఉంటుందని హామీ

Education | ఉమ్మడి రంగారెడ్డి, ఆంధ్రప్రభ: మంచి చదువుతోనే విద్యార్థులు జ్ఞానవంతులుగా ఎదుగుతారని, విద్య ద్వారానే జీవితంలో ప్రగతి సాధించవచ్చని లీడ్ ఇండియా అధినేత, కేఎల్‌ఆర్ ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి కస్తూర్బా పాఠశాలలో లీడ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన నైపుణ్య శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదరికాన్ని రూపుమాపాలన్నా, సమాజంలో గుర్తింపు పొందాలన్నా, వ్యక్తిగతంగా ఉన్నత స్థితికి చేరాలన్నా చదువు ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. మంచి విద్య జీవితాన్ని పూర్తిగా మార్చగల శక్తి కలిగి ఉంటుందని అన్నారు.

ఏదైనా సాధించగలననే ఆత్మవిశ్వాసం ప్రతి విద్యార్థిలో ఉండాలని, ముందుగా తమను తాము నమ్ముకోవాలని సూచించారు. జీవిత లక్ష్యాలను పదేపదే మనసులో గుర్తుచేసుకుంటూ వాటి సాధన కోసం కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.

తెలుగు రాష్ట్రాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల్లో లక్షలాది మంది విద్యార్థులకు జీవిత విలువలు, నైపుణ్య శిక్షణ అందించిన ఏకైక స్వచ్ఛంద సంస్థగా కేఎల్‌ఆర్ ట్రస్ట్, లీడ్ ఇండియా సేవలందిస్తోందని పాఠశాల అధ్యాపక బృందం ప్రశంసించింది.

స్కిల్ డెవలప్‌మెంట్‌తో పాటు మంచి చదువు, సామాజిక విలువలు, కుటుంబ సభ్యుల పట్ల గౌరవం, వ్యక్తిత్వ వికాసం, మంచి నడవడికను పెంపొందించే దిశగా లీడ్ ఇండియా బృందం కృషి చేస్తోందని కోఆర్డినేటర్ రంజిత్ తెలిపారు.

పేద విద్యార్థుల విద్య, నైపుణ్య శిక్షణ కోసం ఎంత ఖర్చైనా భరించేందుకు కేఎల్‌ఆర్ ట్రస్ట్ సిద్ధంగా ఉంటుందని ఛైర్మన్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు.