Tomato-Prices-Crash : టమాటా ధర నుజ్జు నుజ్జు Andhra Prabha Top Story

Tomato-Prices-Crash : టమాటా ధర నుజ్జు నుజ్జు Andhra Prabha Top Stor

  • ఇది సిండికేట్​ దెబ్బే
  • రైతన్న ఆందోళన
  • కుప్పం–పలమనేరు లో టమాటా నేలపాలు
  • గిట్టుబాబు ధర కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

Tomato-Prices-Crash : చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో టమాటా రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. రాష్ట్రంలోనే ప్రధాన టమాటా సాగు ప్రాంతాలుగా పేరొందిన ఈ ప్రాంతాల్లో సీజన్‌ను బట్టి సుమారు 18 వేల నుంచి 22 వేల ఎకరాల వరకు టమాటా సాగవుతోంది. వేలాది మంది రైతులు లక్షల రూపాయలు అప్పులు చేసి పంటను సాగు చేసినప్పటికీ ప్రస్తుతం మార్కెట్‌లో ధరలు పూర్తిగా కుప్పకూలడంతో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. కోత, కూలీలు, రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో పండించిన టమాటాను మార్కెట్‌కు తీసుకెళ్లడం కంటే రోడ్లపక్కనే పారబోయడం మేలని భావించే పరిస్థితి నెలకొంది. టమాటో ధరలు క్షమించడంతో రైతుల ఆందోళన చేస్తున్నారు. దళారుల సిండికేట్ కావడంతో టమాటా ధరలు పడిపోయాయని ఇటీవల పలమనేర్ మార్కెట్ కమిటీ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు.

పలమనేరు వ్యవసాయ మార్కెట్ పరిధిలోని సాకేఊరు సమీపంలో బైరెడ్డిపల్లి రహదారిపై రైతు వెంకటేష్ ఒక ట్రాక్టర్ లోడ్ టమాటాను రోడ్డుపక్కనే పడేయడం రైతుల దుస్థితికి నిదర్శనంగా నిలిచింది. ధరలు లేక పంటను నేలపాలు చేయాల్సి వస్తోందని, ఇంత జరుగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. టమాటా సాగు చేసిన రైతుల కష్టాలను గుర్తించి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పలమనేరు వ్యవసాయ మార్కెట్‌కు ప్రతిరోజూ భారీగా టమాటా వస్తుండగా, ప్రస్తుతం అధిక దిగుబడులు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఒకేసారి పంట మార్కెట్‌కు రావడం, వినియోగం తగ్గడం, రవాణా, ఎగుమతులు మందగించడం వంటి కారణాలతో ధరలు అమాంతం పడిపోయాయి.

గతంలో 15 కిలోల టమాటా క్రేట్‌కు రూ. 500 నుంచి రూ. 800 వరకు ధర లభించగా, ప్రస్తుతం నాణ్యతను బట్టి రూ. 50 నుంచి రూ. 150 మాత్రమే పలుకుతోంది. దీంతో ఎకరానికి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులకు కనీస ఖర్చులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇదిలా ఉండగా, గత శుక్రవారం పలమనేరు టమాటా మార్కెట్ ఎదుట రైతులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. మార్కెట్ ప్రధాన ద్వారాలను మూసివేసి జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు.

మండీ యజమానులు, వ్యాపారులు కుమ్మక్కై ధరలను కృత్రిమంగా తగ్గిస్తున్నారని రైతులు తీవ్ర ఆరోపణలు చేశారు. పలమనేరు మార్కెట్‌లో తక్కువ ధరకు కొనుగోలు చేసి సమీపంలోని వి.కోట, పుంగనూరు, మదనపల్లె, కర్ణాటకలోని మార్కెట్లలో అధిక ధరలకు విక్రయిస్తూ లక్షల రూపాయలు లాభాలు పొందుతున్నారని వారు విమర్శించారు. రైతుల నిరసనతో జాతీయ రహదారిపై అరగంటకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం సమస్య పరిష్కారంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

టమాటా ధరల వ్యవహారంపై సోమవారం పలమనేరు మార్కెట్ కమిటీ కార్యాలయంలో రైతులు, వ్యాపారులు, మండీ యజమానులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెలల తరబడి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను దోచుకుంటున్నారని, దీనిపై మార్కెట్ కమిటీ అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

దీనికి స్పందించిన మండీ యజమానులు మార్కెట్‌కు వస్తున్న టమాటా నాణ్యతను బట్టే ధరలు నిర్ణయిస్తామని చెప్పారు. అయితే రైతులు ఈ వాదనను తీవ్రంగా ఖండించారు. సమావేశంలో రైతులు, అధికారులు, వ్యాపారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా, చివరకు ప్రజాప్రతినిధుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ రైతులకు అన్యాయం చేసే వ్యాపారులు ఎవరైనా ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అవసరమైతే మండీల లైసెన్సులు కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. రైతులు ఎక్కడ ఎక్కువ ధర లభిస్తే అక్కడ తమ టమాటాను విక్రయించుకోవచ్చని సూచించారు. మార్కెట్‌కు అధికంగా బాగా పండిన టమాటా వస్తుండడంతో ధరలు తగ్గుతున్నాయని, నాణ్యమైన టమాటాకు మాత్రం మంచి ధర లభిస్తోందని వివరించారు. అయితే రైతులు మాత్రం ఈ వివరణతో సంతృప్తి చెందడం లేదు. మార్కెట్‌లో పారదర్శక వేలం నిర్వహించాలని, వ్యాపారుల కుమ్మక్కును అరికట్టాలని, ధరల స్థిరీకరణ నిధి ద్వారా జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు. పెట్టుబడులు తిరిగి రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం కుప్పం, పలమనేరు ప్రాంతాల్లో రోడ్లపై టమాటా పారబోస్తున్న దృశ్యాలు రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభానికి అద్దం పడుతున్నాయి.