ఎడతెరిపి వర్షం.. నిలిచిన బొగ్గు ఉత్పత్తి
గోదావరిఖని (ఆంధ్రప్రభ): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ఓపెన్‌కాస్ట్ గనులకు వెళ్లే మార్గాలన్నీ బురదమయంగా మారడంతో పాటు గనుల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో బొగ్గు తవ్వకం, రవాణా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా సుమారు 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని సింగరేణి అధికారులు తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టి గనుల్లోని నీటిని తొలగించిన తర్వాతే ఉత్పత్తి పునఃప్రారంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
