వ్యవసాయ సీజన్లో కరెంట్ కోతలు నివారించాలి
చిట్యాల, ఆంధ్రప్రభ: వ్యవసాయ సీజన్లో విద్యుత్ కోతలను నివారించి రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఐతరాజు నర్సింహా డిమాండ్ చేశారు.
మంగళవారం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట తెలంగాణ రైతు సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఐతరాజు నర్సింహా మాట్లాడుతూ, వ్యవసాయ సీజన్లో తరచూ కరెంట్ కోతలు ఉండటంతో పంట పొలాలకు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సరైన వర్షాలు లేకపోవడం, పెట్టిన పెట్టుబడులు తిరిగి రాకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారని పేర్కొన్నారు. బోరు బావులకు తగినంత విద్యుత్ సరఫరా చేసి పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం గ్రామ శాఖ కార్యదర్శి బెలిజ మల్లయ్య, రైతు సంఘం నాయకులు పల్లపు రాములు, కోనేటి యాదయ్య, లింగస్వామి, జాల ఎర్రయ్య, సైదులు, నర్సింహా, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
