ఆపదలో అండగా..

మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన మంత్రి

నర్సంపేట, ఆంధ్రప్రభ: అనారోగ్యంతో హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పరామర్శించారు.

మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్న వారు, వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకుని ప్రజాసేవలో తిరిగి చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.

గతంలో వరంగల్‌లోని రోహిణి ఆసుపత్రి నుంచి హైదరాబాద్ యశోద ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించే సమయంలో ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో చర్యలు తీసుకోవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

రాజకీయాల్లో పార్టీలు, సిద్ధాంతాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ ఆపద సమయంలో పరస్పరం పరామర్శించుకోవడం ప్రజాస్వామ్య విలువలకు నిదర్శనమని, ప్రజాప్రతినిధుల ఆరోగ్యం సమాజానికి ముఖ్యమని ప్రజలు అభిప్రాయపడ్డారు.

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని ప్రజల మధ్యకు రావాలని అభిమానులు, ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించారు.