సీసీ కెమెరాలతో గ్రామ భద్రత
గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణకు మరింత బలం
పాలకుర్తి, ఆంధ్రప్రభ: గ్రామాల్లో భద్రతను పటిష్ఠం చేయడంతో పాటు నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి అన్నారు.

మంగళవారం పాలకుర్తి మండలం జీడీనగర్ గ్రామంలో గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన 15 సీసీ కెమెరాలను డీసీపీ రాంరెడ్డి, రామగుండం ఏసీపీ మడత రమేష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్ మరింత సమర్థవంతంగా మారిందన్నారు. నేరాల నివారణతో పాటు నేరస్తులను గుర్తించి చట్టం ముందు నిలబెట్టడంలో సీసీ కెమెరాలు కీలక ఆధారాలుగా ఉపయోగపడతాయని తెలిపారు.
గ్రామంలోకి వచ్చే, వెళ్లే వ్యక్తులు, వాహనాల కదలికలను పర్యవేక్షించడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ప్రధాన కూడళ్లు, పాఠశాలలు, దేవాలయాలు, వ్యాపార కేంద్రాలు, ప్రధాన రహదారుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే దొంగతనాలు, చోరీలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలను సమర్థవంతంగా అరికట్టవచ్చన్నారు.
యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పిల్లల స్నేహితులు, వారి ప్రవర్తన, రోజువారీ అలవాట్లను గమనిస్తూ అవసరమైన మార్గనిర్దేశం చేయాలని చెప్పారు. అనుమానాస్పద మార్పులు కనిపిస్తే వెంటనే కౌన్సెలింగ్ అందించి, అవసరమైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన గ్రామస్తులను డీసీపీ అభినందించారు. భవిష్యత్తులో కూడా పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ గ్రామాన్ని నేరరహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీఐ కృష్ణకుమార్, ఎస్‌ఐ నూతి శ్రీధర్, సర్పంచ్ సూర రమ, డీసీసీ ప్రధాన కార్యదర్శి సూర సమ్మయ్య, జిల్లా వార్డు సభ్యుల ఫోరం అధ్యక్షుడు తప్పట్ల మోహన్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
