డీఎస్సీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది..

కుప్పం అభివృద్ధికి సీఎం ప్రత్యేక దృష్టి : నారా భువనేశ్వరి

కుప్పం, ఆంధ్రప్రభ బ్యూరో : డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తోందని, వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారని నారా భువనేశ్వరి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా నియామక ప్రక్రియను నిర్వహిస్తోందని, నిరాధార ఆరోపణలతో నిరుద్యోగులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఫలించవని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటనలో భాగంగా మంగళవారం కుప్పం ప్రభుత్వాసుపత్రిలో స్విమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్, టీఎన్‌ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు.

మహిళల్లో క్యాన్సర్‌పై ముందస్తు అవగాహన, నిరంతర పరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రాణాంతక వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించవచ్చని భువనేశ్వరి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలకు వైద్య సేవలు చేరువ చేయాలనే లక్ష్యంతో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసిన స్విమ్స్ ప్రతినిధులను ఆమె అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరోగ్య, సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ముఖ్యంగా తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా సురక్షితమైన రక్తాన్ని అందిస్తూ వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని పేర్కొంటూ, యువత పెద్ద సంఖ్యలో రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని భువనేశ్వరి అన్నారు. కుప్పం ప్రజలు తనకు, తమ కుటుంబానికి చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కుప్పం ప్రాంత యువత ఉద్యోగాల కోసం పొరుగు రాష్ట్రం కర్ణాటకకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయని పేర్కొన్నారు.

కుప్పం పారిశ్రామిక అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారని, ఒకేసారి 30 పరిశ్రమలను కుప్పానికి తీసుకువచ్చారని ఆమె తెలిపారు. ఈ పరిశ్రమల ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో వలసలు తగ్గే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. కుప్పాన్ని పారిశ్రామిక, విద్యా, ఆరోగ్య రంగాల్లో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కార్యాచరణతో ముందుకు సాగుతోందన్నారు.

అంతకుముందు శాంతిపురం మండలం శివపురంలోని తమ నివాసంలో స్థానిక మహిళలతో కలిసి భువనేశ్వరి అల్పాహారం చేశారు. అనంతరం కుప్పం ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్‌ను ప్రారంభించి, టీఎన్‌ఎస్ఎఫ్ నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సందర్శించి రక్తదాతలను అభినందించారు. వైద్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో మాట్లాడి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.