Jurala Project | జూరాల నుంచి భారీగా నీటి విడుదల..
రెండు రోజుల్లో శ్రీశైలం జలాశయానికి వరద జలాలు
Jurala Project | కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ : కర్ణాటక, మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు జలవిద్యుత్ కేంద్రం నుంచి విడుదల చేస్తున్న నీటితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం జలాశయం వైపు పరుగులు తీస్తోంది. ప్రస్తుతం జూరాల నుంచి విడుదలవుతున్న ప్రవాహం మరో రెండు రోజుల్లో శ్రీశైలం జలాశయానికి చేరుకునే అవకాశం ఉందని కర్నూలు జిల్లా జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ కబీర్ భాష తెలిపారు.
మంగళవారం ఉదయం 9 గంటల నాటికి శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 820.60 అడుగులు నమోదైంది. ప్రస్తుతం జలాశయంలో 41.2794 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, పూర్తి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి సెకనుకు 27,210 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. ఈ ప్రవాహమంతా జూరాల జలవిద్యుత్ కేంద్రం నుంచి విడుదలవుతున్న నీరే. సుంకేసుల, హంద్రీ, స్థానిక క్యాచ్మెంట్ ప్రాంతాల నుంచి ప్రస్తుతం ఎలాంటి ప్రవాహం నమోదుకాలేదు.

జలాశయం నుంచి ప్రస్తుతం నీటి విడుదల లేదు. కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేపట్టడం లేదు. అలాగే స్పిల్‌వే గేట్ల ద్వారా కూడా దిగువకు నీటిని విడుదల చేయడం లేదు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో కృష్ణానదిలో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో కూడా పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం వస్తున్న ప్రవాహంతో జలాశయంలో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతుండటంతో దిగువ ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలకు ఇది ఊరటనిచ్చే అంశంగా భావిస్తున్నారు.
గత ఏడాది ఇదే సమయంలో ..

గత ఏడాది జూలై 28, 2025 నాటికి ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయం దాదాపు పూర్తిస్థాయి నిల్వకు చేరుకుంది. అప్పటికి నీటిమట్టం 882.40 అడుగులకు, నీటి నిల్వ సుమారు 199 టీఎంసీలకు చేరింది. ఇన్‌ఫ్లో 1,27,392 నుంచి 1,85,034 క్యూసెక్కుల మధ్య నమోదవడంతో స్పిల్‌వే గేట్లను ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు. జూరాల, సుంకేసులతో పాటు స్థానిక క్యాచ్మెంట్ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి చేరింది.
అయితే ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఎల్నీనో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదవుతుండటంతో ప్రస్తుతం జలాశయంలో 41.2794 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. ఇన్‌ఫ్లో 27,210 క్యూసెక్కులు మాత్రమే నమోదవుతోంది. జూరాల జలవిద్యుత్ కేంద్రం నుంచి వస్తున్న ప్రవాహమే ప్రధాన ఆధారంగా ఉండగా, సుంకేసుల, హంద్రీ, స్థానిక క్యాచ్మెంట్ ప్రాంతాల నుంచి ఎలాంటి ప్రవాహం లేదు. దీంతో జలాశయం నుంచి నీటి విడుదల చేపట్టకపోవడంతో పాటు జలవిద్యుత్ ఉత్పత్తి కూడా నిలిపివేశారు.
గతేడాది – ఈ ఏడాది శ్రీశైలం పరిస్థితి
అంశం 2025 (జూలై 28) 2026 (జూలై 28)
నీటిమట్టం 882.40 అడుగులు 820.60 అడుగులు
నీటి నిల్వ సుమారు 199 టీఎంసీలు 41.2794 టీఎంసీలు
ఇన్‌ఫ్లో 1.85 లక్షల క్యూసెక్కుల వరకు 27,210 క్యూసెక్కులు
నీటి విడుదల స్పిల్‌వే గేట్లు ఎత్తి విడుదల గేట్లు మూసివేత.. విడుదల లేదు
