పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో సిరిసిల్ల కోర్టు తీర్పు

సిరిసిల్ల టౌన్, ఆంధ్రప్రభ : సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్ మంగళవారం తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. సిరిసిల్లకు చెందిన బూర్ల చంద్రశేఖర్ అనే వ్యక్తి ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడగా, బాలిక తల్లి ఫిర్యాదు మేరకు సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అప్పటి సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.

కోర్టు విచారణలో భాగంగా అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో కోర్టు మానిటరింగ్ ఎస్‌ఐలు రవీందర్ నాయుడు, శ్రవణ్ ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ జనార్ధన్, కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్ నవీన్, పోక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెల కలిసి 15 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రజినీకాంత్ వాదనలు వినిపించారు.

శాస్త్రీయ ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువైనట్లు నిర్ధారించి నిందితుడు బూర్ల చంద్రశేఖర్‌కు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించారు.

పోక్సో కేసుల్లో జిల్లా పోలీసులు సమర్థవంతమైన దర్యాప్తు చేపట్టి, ప్రాసిక్యూషన్‌తో సమన్వయం చేసుకుంటూ వేగవంతమైన విచారణ జరిగేలా చర్యలు తీసుకుంటున్నారని జిల్లా ఎస్పీ తెలిపారు. నేరం చేసిన వారు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని, కఠిన శిక్షల ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఈ కేసులో పకడ్బందీగా దర్యాప్తు నిర్వహించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ప్రస్తుత డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ శ్రీనివాస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రజినీకాంత్, కోర్టు మానిటరింగ్ ఎస్‌ఐలు రవీందర్ నాయుడు, శ్రవణ్, కోర్టు కానిస్టేబుల్ జనార్ధన్, కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్ నవీన్, పోక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెలలను జిల్లా ఎస్పీ అభినందించారు.