ఆషాఢ ఆనందం.. గోరింటాకుతో మహిళల సంబరాలు
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ: భూపాలపల్లి మున్సిపాలిటీ 22వ వార్డు లక్ష్మీనగర్‌లో వార్డు కౌన్సిలర్ బుర్ర రమాదేవి–సదానందం ఆధ్వర్యంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆషాఢ గోరింటాకు సంబరాలు ఘనంగా నిర్వహించారు.
మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ ఆనందోత్సాహాల మధ్య పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం శుభప్రదమనే విశ్వాసంతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు మహిళలు తెలిపారు.
ఆధునిక జీవనశైలిలో కనుమరుగవుతున్న తెలుగు సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. పాటలు, ముచ్చట్లు, ఆత్మీయ పలకరింపులతో లక్ష్మీనగర్ వీధి పండుగ శోభను సంతరించుకుంది.
మహిళల ఐక్యత, కుటుంబ బంధాలు, తెలుగు సంస్కృతి గొప్పతనాన్ని ప్రతిబింబించిన ఈ గోరింటాకు సంబరాలు స్థానికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “సంప్రదాయం నిలిస్తే సంస్కృతి నిలుస్తుంది” అనే సందేశంతో కార్యక్రమం ముగిసింది.
