weather | చ‌ల్ల‌ని క‌బురు

తెలంగాణ‌లో ఆరు రోజులు వర్షాలు
పలుచోట్ల ఈదురుగాలులు
ఉరుములతో వర్షాలు
ఎల్లో అల‌ర్ట్ జారీ చేసిన ఐఎండీ

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎండ‌లు దంచికొట్టాయి. ఒక్క‌సారిగా ఉష్ణోగ్ర‌త‌లు పెరిగిపోయాయి. మార్చిలోనే భానుడు భ‌గ‌భ‌గ మండ‌టంతో ప్ర‌జ‌లు ఉక్కిరిబిక్కిరయ్యారు. అయితే వాతావ‌ర‌ణ శాఖ చ‌ల్ల‌ని క‌బురు చెప్పింది. ఏపీ, తెలంగాణలో రానున్న ఆరు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుందని వెల్లడించింది. దీంతో తెలంగాణ‌లో ఎండ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టనుంది.

తెలంగాణలో రాబోయే ఆరు రోజుల పాటు పలు జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్ర‌క‌టించారు. సోమవారం నిజామాబాద్​, కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్​, మెదక్​, నల్గొండ, హైదరాబాద్​ జిల్లాల్లో వర్షాలు మొదలై మంగళవారం, బుధవారాల్లో ఉత్తర తెలంగాణలోని మరికొన్ని చోట్లకు విస్తరిస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది.

సోమవారం ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటితో పాటు అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు పడొచ్చని తెలిపింది.