చదువుతోపాటు క్రీడలు ముఖ్యమే: ఎం.డి కృష్ణ భరత్

రాప్తాడు, ఆంధ్రప్రభ : సీబీఎస్‌ఈ క్లస్టర్-7 ఖోఖో క్రీడా పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన మాంటిస్సోరి ఎలైట్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్యార్థినులను పాఠశాల ఎండీ కృష్ణ భరత్, కరస్పాండెంట్ కృష్ణ సమీర అభినందించారు. ఈ సందర్భంగా ఖోఖో కోచ్ వీరన్నను ప్రత్యేకంగా సన్మానించి అభినందనలు తెలిపారు.

రాప్తాడు మండలం గొల్లపల్లి గ్రామ సమీపంలోని మాంటిస్సోరి ఎలైట్ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో విజేతల అభినందన సభ నిర్వహించారు. పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులు ఈ నెల 23 నుంచి 26 వరకు కరీంనగర్ జిల్లాలోని ఆల్ఫోర్స్ స్కూల్‌లో నిర్వహించిన సీబీఎస్‌ఈ క్లస్టర్-7 ఖోఖో పోటీల అండర్-17 విభాగంలో ఇంటర్‌స్టేట్ స్థాయిలో ప్రథమ స్థానం సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి దాదాపు 64 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయని పేర్కొన్నారు. ఇంటర్‌స్టేట్ స్థాయిలో విజేతలుగా నిలిచిన ఈ విద్యార్థినులు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు చెన్నైలోని వేలమ్మల్ విద్యాలయంలో జరగనున్న జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ప్రతాప్ రెడ్డి, ఖోఖో కోచ్ వీరన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.