ram gopal varma |ఆర్జీవీ సంచలన పోస్ట్
ram gopal varma |ఆర్జీవీ సంచలన పోస్ట్
ఏఐ యుగంలో కంఠస్థ విద్యకు కాలం చెల్లిందన్న రామ్‌గోపాల్ వర్మ
మెడికల్ విద్య, నీట్‌పై ప్రశ్నలు..
సోషల్ మీడియాలో చర్చకు దారితీసిన ట్వీట్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) మరోసారి తన సంచలన సోషల్ మీడియా పోస్టుతో చర్చనీయాంశమయ్యారు. “Education Should Be Killed” (ప్రస్తుత విద్యా వ్యవస్థను అంతం చేయాలి) అనే శీర్షికతో ఎక్స్ (ట్విటర్) వేదికగా చేసిన పోస్టులో, ప్రస్తుతం అమలులో ఉన్న కంఠస్థ విద్యా విధానంపై తీవ్ర విమర్శలు చేశారు. కంఠస్థం చేయడం, పరీక్షలు రాయడం, డిగ్రీ పొందడం, ఉద్యోగం సాధించడం అనే సంప్రదాయ విధానం ఇక కాలానుగుణం కాదని అభిప్రాయపడ్డారు.
ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వైద్య విద్యను ఉదాహరణగా ప్రస్తావించిన వర్మ.. ఒక విద్యార్థి ఎంబీబీఎస్, పీజీ, స్పెషలైజేషన్ పూర్తి చేయడానికి దాదాపు పదేళ్లు వెచ్చిస్తుంటే, అదే సమాచారాన్ని ఏఐ మరింత వేగంగా విశ్లేషించే స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో నిర్ధారణ, శస్త్రచికిత్స వంటి అనేక వైద్య సేవల్లో ఏఐ, రోబోటిక్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఇప్పటికీ నీట్ పరీక్షలకు సిద్ధమవడం, సాంప్రదాయ కోర్సులకే పరిమితం కావడం ఎందుకని వర్మ ప్రశ్నించారు. “మన ఫోన్‌కు ఇప్పటికే తెలిసిన విషయాలను ఎందుకు కంఠస్థం చేయాలి?” అని ప్రశ్నించే యువతను సమాజం అర్థం చేసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా మారుతున్న పరిస్థితులను గుర్తించి, యువతను ఏఐ ఆధారిత నైపుణ్యాల వైపు వేగంగా నడిపించాలని సూచించారు.
వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. కొందరు ఆయన అభిప్రాయాలను సమర్థిస్తుండగా, మరికొందరు విద్యా వ్యవస్థలో సంస్కరణలు అవసరమే కానీ, సంప్రదాయ విద్యను పూర్తిగా తిరస్కరించడం సరైన దృక్పథం కాదని అభిప్రాయపడుతున్నారు.
