కోరిన కోర్కెలు తీర్చే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి
భక్తుల కొంగు బంగారమైన లింబాద్రి గుట్ట క్షేత్రం
భీమ్‌గల్ టౌన్, (ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలోని లింబాద్రి గుట్ట తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి. పచ్చని కొండల నడుమ ప్రకృతి రమణీయతతో అలరారే ఈ క్షేత్రంలో స్వయంభువుగా వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా ఈ స్వామివారిని భక్తులు విశ్వసిస్తారు.
ప్రతి ఏడాది కార్తీకమాసంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున జరిగే రథోత్సవానికి తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వేలాదిమంది భక్తులు హాజరవుతారు.
ప్రత్యేకతలు
భీమ్‌గల్ మండల కేంద్రానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న లింబాద్రి గుట్ట రెండు అంతస్తులుగా ఉంటుంది. మొదటి అంతస్తుకు మెట్ల మార్గం, రహదారి మార్గం ఉన్నాయి. అక్కడ శ్రీవారి మాడవీధులు, కమలా పుష్కరిణి, కళ్యాణ మండపం, రథం గుడి, అయోధ్య ఆంజనేయస్వామి ఆలయం ఉన్నాయి.
రెండో అంతస్తులో లోతైన సహజ రాతి గుహలో స్వామివారి మూలవిరాట్టు కొలువై ఉంది. ఇరుకైన గుహ మార్గం గుండా సుమారు 250 మీటర్లు ప్రయాణించి గర్భాలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. గర్భాలయం ప్రవేశద్వారం వద్ద జోడు లింగాలు దర్శనమిస్తాయి. గర్భగుడిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారితో పాటు నరనారాయణుల (కృష్ణార్జునుల) విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటాయి.

శాంత స్వరూపంలో నరసింహుడు
సాధారణంగా నరసింహస్వామి ఆలయాల్లో ఉగ్రరూపంలో దర్శనమిచ్చే స్వామివారు, లింబాద్రి గుట్టలో మాత్రం లక్ష్మీదేవిని తొడపై ఆసీనురాలిగా ఉంచుకుని శాంతస్వరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇదే ఈ క్షేత్ర ప్రత్యేకతగా భావిస్తారు.
స్వయంభూ క్షేత్రం
పురాణాల ప్రకారం, బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సు చేసి శ్రీహరిని నరసింహస్వరూపంలో సాక్షాత్కరించుకున్నాడని, అనంతరం స్వామివారు లక్ష్మీదేవితో కలిసి ఇక్కడ స్వయంభువుగా వెలిశారని విశ్వసిస్తారు.
దక్షిణ బద్రీనాథ్‌గా విశిష్టత
పవిత్ర బద్రీనాథ్ క్షేత్రం తరువాత గర్భాలయంలో స్వామివారి పక్కనే నరనారాయణుల విగ్రహాలు ఉన్న అరుదైన క్షేత్రంగా లింబాద్రి గుట్ట ప్రసిద్ధి చెందింది. అందుకే దీనిని “దక్షిణ బద్రీనాథ్” అని కూడా పిలుస్తారు.
జోడు లింగాల మహిమ
పురాణాల ప్రకారం పరమశివుడు బ్రహ్మహత్యా దోష నివారణ కోసం ఇక్కడ తపస్సు చేసి జోడు లింగాల రూపంలో వెలిశాడని చెబుతారు. గర్భాలయ ప్రవేశద్వారం వద్ద ఈ జోడు లింగాలు భక్తులకు దర్శనమిస్తాయి.
అయోధ్య ఆంజనేయస్వామి ఆలయం
శ్రీరాముని ఆజ్ఞతో హనుమంతుడు ఈ క్షేత్రానికి వచ్చి తపస్సు చేసి నరసింహస్వరూపంలో ఉన్న శ్రీరాముడిని దర్శించాడని పురాణ కథనం. అందుకే కొండ దిగువన అయోధ్య ఆంజనేయస్వామి ఆలయం ఉంది.
కమలా పుష్కరిణి
ఈ క్షేత్రంలోని పవిత్ర తీర్థానికి కమలా పుష్కరిణి అని పేరు. సత్యహరిశ్చంద్రుడు, ధర్మరాజు, ప్రహ్లాదుడు తదితరులు ఈ క్షేత్రాన్ని దర్శించి పుణ్యం పొందినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి.
క్షేత్ర ప్రభావం
లింబాద్రి గుట్ట ప్రభావంతో నిజామాబాద్‌తో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, వరంగల్ తదితర జిల్లాల్లో లింబాద్రి, లింబయ్య, నర్సింహులు, నర్సయ్య, నర్సింగ్ వంటి పేర్లు విస్తృతంగా కనిపిస్తాయి.
ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుంచి ఆర్మూర్ వరకు నేరుగా బస్సు సౌకర్యం ఉంది. నిజామాబాద్ నుంచి ఆర్మూర్ కు సుమారు 25 కి.మీ., అక్కడి నుంచి భీమ్‌గల్‌కు మరో 25 కి.మీ. ప్రయాణించాలి. భీమ్‌గల్ నుంచి లింబాద్రి గుట్టకు సుమారు 5 కి.మీ. దూరం ఉండగా, బస్సులు, ఆటోలు, ఇతర వాహనాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. బ్రహ్మోత్సవాల సమయంలో దేవస్థానం భక్తులకు పరిమిత బస సౌకర్యాన్ని కూడా కల్పిస్తుంది.
