ఎల్నినో ఎఫెక్ట్.. ప్రత్యామ్నాయ పంటలతో నష్టాలను తగ్గించుకోవాలి
టేకుమట్ల, ఆంధ్రప్రభ: ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని వ్యవసాయ అధికారులు సూచించారు. టేకుమట్ల రైతువేదికలో సోమవారం ప్రారంభమైన మూడు రోజుల పప్పుధాన్యాలు–కూరగాయల విత్తన మేళాలో వ్యవసాయ అధికారి కళ్యాణి రైతులకు అవగాహన కల్పించారు. భూగర్భ జలాలు తగ్గే అవకాశమున్న నేపథ్యంలో కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, రాగి, నువ్వులు వంటి తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకోవాలని సూచించారు. అలాగే ప్రత్తి–కంది, కంది–మొక్కజొన్న వంటి అంతర పంటల సాగుతో నీటి వినియోగం తగ్గడంతో పాటు ఆదాయంలో స్థిరత్వం సాధించవచ్చని వివరించారు.
మేళాలో రైతులకు నాణ్యమైన పప్పుధాన్యాలు, కూరగాయల విత్తనాలను ఐదు ప్రత్యేక కౌంటర్ల ద్వారా పంపిణీ చేశారు. శాస్త్రీయ యాజమాన్య పద్ధతులతో పంటల వైవిధ్యీకరణ చేపడితే ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని అధిగమించి మెరుగైన దిగుబడులు సాధించవచ్చని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో టేకుమట్ల సర్పంచ్, ఏఈఓలు, విత్తన డీలర్లు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
