దుర్గగుడి లాకర్‌లో భక్తుడి సెల్‌ఫోన్ మాయం…

  • రూ.68 వేల విలువైన ఫోన్ కనిపించక ఆందోళన..
  • సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఓ భక్తుడి సెల్‌ఫోన్ మాయమైన ఘటన కలకలం రేపింది. ఆలయంలోని లాకర్‌లో భద్రపరిచిన సుమారు రూ.68 వేల విలువైన మొబైల్ ఫోన్ కనిపించకపోవడంతో బాధితుడు దేవస్థానం అధికారులతో పాటు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

వివరాల ప్రకారం.. కుందావారి కండ్రికకు చెందిన మున్నంగి దుర్గారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శనివారం అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఆలయంలోకి సెల్‌ఫోన్లకు అనుమతి లేకపోవడంతో, తన మొబైల్ ఫోన్‌ను టోకెన్ నంబర్ 4902కు సంబంధించిన లాకర్‌లో భద్రపరిచి దర్శనానికి వెళ్లారు.

దర్శనం అనంతరం టోకెన్ రసీదుతో లాకర్ వద్దకు వెళ్లి ఫోన్ తీసుకునే ప్రయత్నం చేయగా, లాకర్‌లో తన సెల్‌ఫోన్ కనిపించలేదు. దీంతో బాధితుడు అక్కడి సిబ్బందిని ప్రశ్నించగా, తమకు విషయం తెలియదని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. దీంతో దుర్గారెడ్డి దేవస్థానం అధికారులకు సమాచారం ఇచ్చి, అనంతరం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించినట్లు తెలిసింది.

లాకర్‌లో భద్రపరిచిన వస్తువు ఎలా మాయమైందనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది చోరీనా, లేక నిర్వహణలో లోపమా అన్నది దర్యాప్తులో తేలనుంది. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పరిశీలించే అవకాశముంది. ఈ ఘటనతో ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వినియోగించే లాకర్ వ్యవస్థ భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లాకర్‌ల నిర్వహణలో మరింత పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.