ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరూ పేరు నమోదు చేసుకోవాలి:

గంట రవికుమార్

కరీమాబాద్, ఆంధ్రప్రభ: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు.

గ్రేటర్ వరంగల్ పెరుకవాడ 33వ డివిజన్‌లో శనివారం ఓటరు ప్రత్యేక సవరణ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో బీఎల్‌ఓలకు ఎన్యుమరేషన్ ఫారాలను బీజేపీ నాయకులు అందజేశారు.

పెరుకవాడ 33వ డివిజన్ పరిధిలోని ప్రతాపరుద్ర కమ్యూనిటీ హాల్, మహాత్మా గాంధీ కమ్యూనిటీ హాల్‌లో బీజేపీ జిల్లా కార్యదర్శి మంద శ్రీనివాస్, జిల్లా నాయకుడు మెంగని నరేష్ ఆధ్వర్యంలో ఓటరు ప్రత్యేక సవరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన గంట రవికుమార్ డ్రైవ్ నిర్వహణ తీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల సవరణ, కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 33వ డివిజన్ పరిధిలో కొత్తగా ఓటు హక్కు పొందే యువతీ యువకులతో పాటు, ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు అవసరమైన స్థానిక ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకుడు ముద్దసాని కృష్ణ, బీఎల్‌ఏ, బీఎల్‌ఓలు, స్థానిక ఓటర్లు పాల్గొన్నారు.