డిసీసీ నూతన బ్రాంచ్ ప్రారంభం

డిసీసీ నూతన బ్రాంచ్ ప్రారంభం

హసన్ పర్తి, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువ చేయడంలో డీసీసీ నూతన బ్రాంచ్ కీలక పాత్ర పోషిస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమానికై హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం కేంద్రంలో పిఏసీఎస్ వద్ద నిర్మించిన అదనపు గదులలో ఏర్పాటు చేసిన డీసీసీ బ్యాంక్ బ్రాంచ్‌ను ఎమ్మెల్యేతో పాటు వరంగల్ ఎంపీ కడియం కావ్యలు ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు, మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలు, చిన్న వ్యాపారులు సులభంగా రుణాలు, డిపాజిట్ సేవలు ఇతర ఆర్థిక సౌకర్యాలను పొందేందుకు ఈ బ్రాంచ్ ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో డీసీసీ బ్యాంకులు ప్రధాన వనరులుగా పని చేస్తాయని, రైతులు ఈ అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని తమ వ్యవసాయ, ఉపాధి కార్యకలాపాలను అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నదని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత రాష్ట ప్రభుత్వానికే దక్కిందని పేర్కొన్నారు. రైతు భరోసా నిధులు సైతం రెండో విడత విడుదల చేయడం శుభపరిణామమని తెలిపారు. హసన్ పర్తి శాఖ ఆధ్వర్యంలో మల్టీ సర్వీస్ సెంటర్ ను ప్రారంభించి మరింత అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, డిసిసిబి బ్యాంక్ సీఈవో వజీర్ సుల్తాన్, పిఎసిఎస్ ఇంచార్జ్ జగన్మోహన్ రావు, డిసిసిబి డీడీ రవీందర్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వెంకటరామిరెడ్డి,ఏవో అనురాధ, మండల కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ బిగుళ్ళ సురేష్, 66వ డివిజన్ అధ్యక్షులు కనపర్తి కిరణ్ ఆత్మకూరు ఏఎంసీ వైస్ చైర్మన్ తంగళ్ళపల్లి తిరుపతి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రామ్ నరసింహారెడ్డి, మండల గ్రామస్థాయి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply