దళితుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం..
రాప్తాడు, ఆంధ్రప్రభ : ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసుల్లో పోలీసులు నిరంతరం నిర్లక్ష్యం వహిస్తూ పెత్తందారుల కొమ్ము కాస్తున్నారని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఎపి రైతు సంఘం జిల్లా నాయకులు బాల రంగయ్య పోతులయ్య పేర్కొన్నారు.శనివారం రాప్తాడు మండల కేంద్రం నందు కెవిపిఎస్ వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాల ఆధ్వర్యంలో కరపత్రికలు విడుదల చేశారు.
అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం జిల్లా నాయకులు బాల రంగయ్య పోతులయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సామాజిక ఆర్ధిక రాజకీయ సాంస్కృతిక మత ప్రాంత లింగ సమస్యలతో పాటు స్మశానాల సమస్యలు కాలనీలలో మౌలిక సమస్యలు విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి దళితులకు ఏ విధంగా అందుతున్నాయో పరిశీలించడానికి కెవిపిఎస్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రజా సంఘాల కార్యకర్తలు జూలై 16 నుండి 26 వరకు అధ్యయన యాత్రలు చేస్తున్నామని తెలిపారు.
గ్రామాల్లో దళితులు నుండి వచ్చిన సమస్యలపై ప్రజలందరిని కలుపుకొని సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాడుదామని అన్నారు.దళితుల స్మశాన సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన జీవో 1235 అమలు చెయ్యాలని జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులు అమలు చెయ్యాలని కోనేరు రంగారావు కమీషన్ సిఫారసులు అమలు చేసి భూమి లేని ప్రతి కుటుంబానికి రెండు ఎకరాలు భూమి ఇవ్వాలని కులాంతర వివాహాల రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
అలాగే మతం పేరుతో వేధింపులు ఆపాలి. దళిత పేటల్లో మూసివేసిన ప్రాథమిక పాఠశాలలు పునరుద్ధరించాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థుల స్కాలర్ షిప్ పెంచాలి. పిల్లల ఆరోగ్య బాధ్యత తీసుకోవాలి. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చెయ్యాలి. దళిత మహిళలను కించపరుస్తూ మాట్లాడే అహంకార భాషను అరికట్టాలి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చెయ్యాలి. ఎస్సీ కార్పోరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలి. బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చెయ్యాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ పునరుద్ధరించాలి.
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చెయ్యాలి. పై సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడేందుకు ప్రజలు ముందుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.కులంతో నిమిత్తంలేకుండా అన్ని కులాల్లోని ప్రజాతంత్ర అభ్యుదయ వాదులు ముందుకొచ్చి సహకరించాలని కోరారు. దళిత సమస్య ఒక కులానికి మాత్రమే సంబంధించినది కాదు. అదొక సామాజిక సమస్య అనాగరిక వ్యవస్థ అవశేషం. సామాజిక న్యాయాన్ని అభివృద్ధిని కాంక్షింకే వాళ్ళు ఏ కులమైనా ప్రతి ఒక్కరు ఈ ఉ ద్యమంలో భాగస్వాములు కావాలని సామాజిక శంఖారావం బృందాలకు తోడ్పడాలని కోరుతున్నాము.ఈ కార్యక్రమంలో సుబ్బిరెడ్డి మరియమ్మ జనార్ధన్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.
