Fast Food Inspection | అపరిశుభ్ర పరిస్థితుల్లో ఆహార తయారీ
80 కిలోల చికెన్ సీజ్.. వాడిన నూనెతో వంటలు..
ముగ్గురిపై కేసులు నమోదు
చాంద్రాయణగుట్టలో ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలపై H-FAST కొరడా
Fast Food Inspection | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ప్రాంతంలోని ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలపై హెచ్-ఫాస్ట్ (H-FAST), జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. అల్ మదీనా, ఒమర్ చైనీస్ ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల్లో చేపట్టిన ఈ తనిఖీల్లో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు.
తనిఖీల్లో ఆయా కేంద్రాల్లో అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసిన 80 కిలోల చికెన్, 20 లీటర్ల వాడిన వంటనూనె, 10 లీటర్ల తాజా వంటనూనెతో పాటు కృత్రిమ ఫుడ్ కలర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు.
తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు సంబంధించిన పలు లోపాలు బయటపడ్డాయి. పెస్ట్ కంట్రోల్ రికార్డులు, నీటి నాణ్యత ధ్రువపత్రాలు అందుబాటులో లేకపోవడంతో పాటు పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడాన్ని అధికారులు గుర్తించారు. అపరిశుభ్ర వాతావరణంలో నిర్వహించే ఆహార కేంద్రాలకు దూరంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు. కల్తీ ఆహారం లేదా ఆహార భద్రతకు సంబంధించిన ఫిర్యాదులను హెచ్-ఫాస్ట్ టోల్‌ఫ్రీ నంబర్ 8712661212కు తెలియజేయాలని కోరారు.
