ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం..
విద్యార్థుల క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టి
మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ : మహబూబ్‌నగర్ రూరల్ మండలం రామచంద్రపురం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో శనివారం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ వై. నర్సిములు (బాబురావు) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు తక్కువ సంఖ్యలో హాజరు కావడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై జరిగే ప్రతి తల్లిదండ్రుల సమావేశానికి విద్యార్థుల తల్లి లేదా తండ్రి తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.
విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపొందించేందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు సెల్‌ఫోన్లకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని అన్నారు.
విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఉపాధ్యాయులు తీసుకునే క్రమశిక్షణ చర్యలను తల్లిదండ్రులు అపార్థం చేసుకోకుండా సహకరించాలని, ఉపాధ్యాయుల పట్ల అసహనం వ్యక్తం చేయకుండా పరస్పర సహకారంతో విద్యాభివృద్ధికి కృషి చేయాలని గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు తల్లిదండ్రులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వై. నర్సిములు (బాబురావు), ఉన్నత, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
