KTR | ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు

భారీగా తరలివచ్చిన యువత
యువ సమస్యలపై బీఆర్ఎస్ ఫోకస్
హైకోర్టు అనుమతితో సభ నిర్వహణ

KTR | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న యువ సంగ్రామ సదస్సుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత ఆయనకు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించగా, నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది.

యువత, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నలు లేవనెత్తడమే ఈ సభ ప్రధాన ఉద్దేశమని బీఆర్ఎస్ నాయకత్వం పేర్కొంటోంది. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, ‘యూత్ డిక్లరేషన్’ హామీల అమలుపై పార్టీ తన అభిప్రాయాలను సభలో వెల్లడించనుంది.

తొలుత సభ నిర్వహణకు అనుమతుల విషయంలో వివాదం నెలకొన్నప్పటికీ, తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో సదస్సు నిర్వహణకు మార్గం సుగమమైంది. సభకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.