KTR | మొదలైన యువ సంగ్రామ సదస్సు
మలక్‌పేటలో ఘన స్వాగతం
నిరుద్యోగం, ఉద్యోగాలపై ఫోకస్
హైకోర్టు అనుమతితో సభ నిర్వహణ
KTR | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ‘యువ సంగ్రామ సదస్సు’కు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం బయలుదేరారు. సభలో ఆయన కీలక ప్రసంగం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలు, ఉద్యోగాల భర్తీలో జాప్యం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన ‘యువ డిక్లరేషన్’ హామీల అమలుపై బీఆర్ఎస్ తన వైఖరిని ఈ సభ ద్వారా ప్రజలకు వివరించనుంది.
సరూర్‌నగర్‌కు వెళ్తున్న మార్గంలో మలక్‌పేట నియోజకవర్గంలో కేటీఆర్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించగా, అభిమానులు పెద్ద ఎత్తున సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్ అంటూ కార్యకర్తలు నినాదాలతో పరిసరాలను మార్మోగించారు.
తొలుత సభ నిర్వహణకు సంబంధించిన అనుమతులపై అనిశ్చితి నెలకొన్నప్పటికీ, తెలంగాణ హైకోర్టు అనుమతి ఇవ్వడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. సభ కోసం పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు.
ఈ సదస్సు ద్వారా రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజకీయంగా నిలదీయాలని బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. సభలో కేటీఆర్ ప్రసంగం పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేసే అవకాశముంది.
