శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కనువిందు చేసిన అడుగుల భజన…
మహబూబ్‌నగర్, ఆంధ్రప్రభ : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కాటన్ మిల్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న 34వ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కౌకుంట్ల మండలం వెంకంపల్లి గ్రామానికి చెందిన శ్రీ అభయాంజనేయ స్వామి అడుగుల భజన మండలి సభ్యులు పంతులు కార్తీక్ ఆచారి ఆధ్వర్యంలో స్వామివారి ఆలయ ప్రాంగణంలో అడుగుల భజన కార్యక్రమాన్ని భక్తి పారవశ్యంతో నిర్వహించారు.
భజన మండలి సభ్యులు స్వామివారి నామసంకీర్తనలు ఆలపిస్తూ అడుగుల భజనతో భక్తులను ఆకట్టుకోగా, చిన్నారులు సైతం సంకీర్తనలకు అనుగుణంగా ఆడుతూ, పాడుతూ ఆకర్షణీయమైన నృత్య ప్రదర్శనలు చేసి అందరినీ అలరించారు. భక్తి సంగీతం, నృత్యాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.ఈ కార్యక్రమంలో వెంకంపల్లి గ్రామ భజన మండలి సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
