చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన వార్డ్బాయ్ అరెస్ట్
- రూ.2.70 లక్షల విలువైన బంగారు గొలుసు, నగదు, మొబైల్, ద్విచక్ర వాహనం స్వాధీనం
చిత్తూరు, (ఆంధ్రప్రభ బ్యూరో) : అప్పుల ఊబిలో కూరుకుపోయి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన తిరుపతి జిల్లా నారాయణవనం మండలం దిగవ కనకంపాళ్యానికి చెందిన పి. అశోక్ (36)ను చిత్తూరు జిల్లా విజయపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.2.70 లక్షల విలువైన 14 గ్రాముల బంగారు గొలుసు, రూ.26 వేల నగదు, ఒక మొబైల్ ఫోన్, నేరానికి వినియోగించిన సుజుకి యాక్సెస్-125 ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెల 9న మధ్యాహ్నం విజయపురం మండలం పన్నూరు బీసీ కాలనీ హరిచంద్రపురం వద్ద ఓ మహిళ దుకాణం వద్ద ఒంటరిగా ఉండగా, బిస్కెట్ ప్యాకెట్ కావాలని అడిగి మాటల్లో పెట్టిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని 14 గ్రాముల బంగారు గొలుసును లాక్కొని ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విజయపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు డీఎస్పీ, ఇన్చార్జి ఎస్డీపీఓ జె. రాంబాబు ఆధ్వర్యంలో, నగరి రూరల్ సీఐ వి. భాస్కర్ పర్యవేక్షణలో విజయపురం ఎస్ఐ టి. వెంకటసుబ్బయ్య ప్రత్యేక బృందంతో విచారణ జరిపారు. దర్యాప్తులో లభించిన సమాచారంతో శుక్రవారం ఉదయం తిరుత్తణి–నాగలాపురం రోడ్డులోని గాండ్లకండ్రిగ క్రాస్ బస్ స్టాప్ వద్ద నిందితుడు పి. అశోక్‌ను అరెస్ట్ చేశారు.
పోలీసుల విచారణలో నిందితుడు 2025లో రేణిగుంటలోని అమర ఆసుపత్రిలో వార్డ్‌బాయ్‌గా పనిచేస్తూ నెలకు రూ.15,800 జీతం పొందినట్లు తేలింది. వ్యక్తిగత ఆర్థిక ఇబ్బందులతో తన తండ్రి అనారోగ్యాన్ని సాకుగా చూపి రోగుల బంధువులను నమ్మించి, స్నేహితుల ఫోన్‌పే ఖాతాల ద్వారా డబ్బులు సేకరించి వాటిని వ్యక్తిగత అవసరాలకు వినియోగించాడు. అనంతరం అప్పులు తీర్చలేక తనపై క్రిమినల్ కేసులు నమోదవుతాయనే భయంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
నిందితుడి వద్ద నుంచి 14 గ్రాముల బంగారు గొలుసు, రూ.26 వేల నగదు, వివో కంపెనీ మొబైల్ ఫోన్, నేరానికి ఉపయోగించిన సుజుకి యాక్సెస్-125 ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో విశేష కృషి చేసిన విజయపురం ఎస్ఐ టి. వెంకటసుబ్బయ్య, నిండ్ర ఎస్ఐ ఎన్. మల్లికార్జున్‌తో పాటు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ తుషార్ డూడి అభినందించారు.
