పాండవుల గుట్టలో వర్షం కోసం మొక్కులు..
గ్రామ ప్రజలతో మొక్కులు చెల్లించిన కొత్తపల్లి గోరి సర్పంచ్ నిమ్మల శంకర్…..
బారీగా మొక్కులు చెల్లించిన గ్రామ ప్రజలు….
రేగొండ, ఆంధ్రప్రభ : వేసవిలోనే ఊరించిన వర్షాలు జాడ లేకుండా పోయాయి. తొలకరి మొదలైన చినుకు తడి కరువైంది. దీంతో వరుణుడి కరుణ కోసం అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ఆరంభమై రెండు నెలలు కావస్తున్న ఒక్క వాన చుక్క కూడా సరిగా కురవకపోడంతో ఆకాశంవైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. వరుణుడి కటాక్షం కోసం రైతులు పాండవుల గుట్టలో మొక్కులు మొక్కుతున్నారు.
వానాకాలంలో ఈసారి నైరుతి రుతుపవనాలు నిర్ణీత సమయం కంటే ముందుగానే కేరళను తాకాయి. రోహిణి కార్తెలోనే చిరుజల్లులతో కూడిన వర్షాలు కురిశాయి. జూన్ రెండో వారంలోగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కూడా ప్రకటించింది. అయితే వర్షాలు విస్తారంగా కురవకపోవడంతో పంటల సాగుపై రైతులు సందిగ్ధంలో పడ్డారు. భూపాలపల్లి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు కురిసి ఆశలు చిగురింపజేసినా, పూర్తిస్థాయిలో కురవక పోవడంతో సందిగ్ధం నెలకొంది. తొలుత కురిసిన వర్షాలకు కొందరు రైతులు విత్తనాలు విత్తారు. మృగశిర కార్తె ముగిసిన వర్షాలు లేక విత్తిన విత్తనాలు మొలకెత్తడం లేదని, మొలకెత్తిన మొలకలు ఎండలకు వాడిపోతున్నాయి.
వర్షాలు కురవాలని పాండవుల గుట్టల్లో మొక్కులు, చెల్లించిన కొత్తపల్లి గోరి గ్రామ ప్రజలు……
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలం పాండవుల గుట్టలో వర్షాలు కురవాలని కొత్తపల్లి గోరి గ్రామ ప్రజలు వరుణ దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షం కోసం మహిళలు పునకాలతో కుంతి గుహ దద్ధరిల్లి పోయింది అలాగే మేకల బండ పై సొరంగంలో వర్షపు నీటితో స్నానాలు చేసి వర్షం కురవాలని అర్ధనాథలు చేసారు.ఇకనైనా వరుణ దేవుడు కరుణించి పుష్కలంగా వర్షాలు కురుస్తాయని ఆశాభావంతో తమ గ్రామానికి వెళ్ళారు.ఈ కార్యక్రమంలో కొత్తపల్లి గోరి గ్రామ సర్పంచ్ నిమ్మల శంకర్, గ్రామ పంచాయతీ వార్డ్ మెంబెర్స్, పంచాయతీ పాలకవర్గం తదితరులు పాల్గొన్నారు.
