Nursing Jobs Telangana | 15 ఏళ్ల నిరీక్షణకు తెర
247 మంది నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు
నియామకాలు పూర్తి చేసిన ప్రభుత్వం: భట్టి విక్రమార్క
ఈఎస్ఐ ఆస్పత్రుల ఆధునీకరణకు చర్యలు..
శంషాబాద్, రామగుండంలో 100 పడకల ఆస్పత్రులు: మంత్రి వివేక్
విదేశీ ఉద్యోగాల కోసం యువతకు నైపుణ్య శిక్షణ..
జర్మనీలో 28 వేల అవకాశాలు ఉన్నాయని వెల్లడి
Nursing Jobs Telangana | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణలో కొత్తగా ఎంపికైన 247 మంది నర్సింగ్ ఆఫీసర్లకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నియామక పత్రాలను అందజేశారు. హైదరాబాద్‌లోని కొమరం భీమ్ ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ నియామక పత్రాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి కార్మిక, గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హాజరయ్యారు. రాష్ట్రంలో గత 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నర్సింగ్ ఆఫీసర్ల నియామక ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో నర్సింగ్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తారని, కొత్తగా నియమితులైన వారు అంకితభావంతో సేవలు అందించాలని సూచించారు.
ఈఎస్ఐ ఆస్పత్రుల అభివృద్ధికి ప్రాధాన్యం
కార్మికులకు, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్రంలోని ఈఎస్ఐ (ESI) ఆస్పత్రులను ఆధునీకరిస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. స్పష్టమైన ప్రణాళికతో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. రామచంద్రాపురం ఈఎస్ఐ ఆస్పత్రిని వేగంగా అభివృద్ధి చేస్తున్నామని, అలాగే శంషాబాద్, రామగుండం ప్రాంతాల్లో రూ.100 పడకల సామర్థ్యంతో కొత్త ఈఎస్ఐ ఆస్పత్రులను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. కార్మికులకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
యువతకు గ్లోబల్ ఉద్యోగ అవకాశాలు
వైద్య రంగ అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివేక్ తెలిపారు. ఇందులో భాగంగా 120 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు టామ్‌కామ్ (TOMCOM) ద్వారా యువతకు విదేశీ భాషలు, అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నామని వివరించారు. ప్రస్తుతం జర్మనీలోనే సుమారు 28 వేల విదేశీ ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, యువత నైపుణ్యాలను పెంచుకుంటే అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన వేతనాలతో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని సూచించారు. ప్రపంచ స్థాయి ఉద్యోగ మార్కెట్‌కు అనుగుణంగా తెలంగాణ యువతను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
