కుమ్మరి కుంట కొలామ్ గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం..

కుమ్మరికుంట కొలామ్ గిరిజన సందర్శించిన రాష్ట్ర ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ , సభ్యులు పిఓ

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని కుమ్మరికుంట గిరిజన గ్రామాన్ని తెలంగాణ రాష్ట్ర ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్, భక్తి వెంకటయ్య, కమిషన్ సభ్యులు, ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారి మంద మకరందు శుక్రవారం సందర్శించారు. గ్రామంలో పర్యటించిన అధికారులు స్థానిక గిరిజన కుటుంబాలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి జీవన పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, నివాస సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు తమకు శాశ్వత గృహాల అవసరం, భూమి, నివాస హక్కులు, తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గ్రామస్థుల సమస్యలను ఎంతో శ్రద్ధగా విన్న రాష్ట్ర ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ సంబంధిత శాఖల అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా ఐటీడీఏ ఉట్నూరు ప్రాజెక్టు అధికారి మందమకరందుమాట్లాడుతూ, కుమ్మరికుంట గ్రామంలోని ప్రతి అర్హ గిరిజన కుటుంబానికి ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గృహ నిర్మాణానికి అవసరమైన అన్ని అర్హతలు, హక్కులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామస్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సమగ్రంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని, త్వరలో గౌరవ ముఖ్యమంత్రితో నిర్వహించే సమావేశంలో ఈ గ్రామానికి సంబంధించిన సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించి, శాశ్వత పరిష్కారం లభించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

గిరిజనుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి అర్హ కుటుంబం ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేలా ఐటీడీఏ తరఫున అన్ని విధాలుగా సహకరిస్తామని ప్రాజెక్టు అధికారి పేర్కొన్నారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి, గృహ నిర్మాణం, తాగునీరు, రహదారులు, విద్య, ఆరోగ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత శాఖల సమన్వయంతో వేగంగా చర్యలు చేపడతామని తెలిపారు.ఈ సందర్శన సందర్భంగా కుసురం నీలాదేవి, రేణిగుంట్ల ప్రవీణ్,రాంబాబు నాయక్ కమిషన్ సభ్యులు, ఐటీడీఏ అధికారులు, అటవీ శాఖ, ఆరోగ్య శాఖ, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, గిరిజన కుటుంబాలు పాల్గొన్నారు. గ్రామస్తులు తమ సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇవ్వడంపై రాష్ట్ర ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్, కమిషన్ సభ్యులు, ప్రాజెక్టు అధికారి మంద మకరందుకు కృతజ్ఞతలు తెలిపారు.