ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరిట సర్టిఫికెట్లు బందీ
ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరిట సర్టిఫికెట్లు బందీ
- ఆదివాసి విద్యార్థినికి ఉన్నత విద్యకు అడ్డంకులు
అచ్చంపేట, ఆంధ్రప్రభ : విద్యే జీవితాలను మార్చగల శక్తి అయినప్పటికీ, కొందరికి అదే విద్యను కొనసాగించడం భారంగా మారుతోంది. బడుగు బలహీన వర్గాల విద్యాభివృద్ధికి ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నా, మారుమూల నల్లమల ప్రాంతానికి చెందిన ఓ ఆదివాసి చెంచు గిరిజన విద్యార్థిని ఉన్నత విద్య కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నాగర్‌కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతంలోని పదర మండలం, ఊడిమిళ్ల గ్రామానికి చెందిన పాపమ్మ–బయన్న దంపతుల ఐదో సంతానం ఎస్తేరమ్మ, ఎన్నో కష్టాలను అధిగమించి మిర్యాలగూడలోని నేను ఇంజనీరింగ్ కాలేజీ లో బీటెక్ (సీఎస్‌ఈ) పూర్తి చేసింది.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు మన్ననూర్ ఐటిడిఏ నుంచి రూ.50 వేల ఆర్థిక సహాయం అందడంతో ఆమె చదువు కొనసాగించగలిగింది. అయితే, తదుపరి ఉన్నత విద్య కోసం అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు కావాలని కళాశాల యాజమాన్యాన్ని సంప్రదించగా, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇంకా అందలేదని, అది వచ్చిన తర్వాతే సర్టిఫికెట్లు ఇస్తామని తెలిపినట్లు విద్యార్థిని వాపోయింది. ఒకవేళ వెంటనే సర్టిఫికెట్లు కావాలంటే రూ.2 లక్షలు చెల్లించాలని కళాశాల యాజమాన్యం షరతు విధించినట్లు పేర్కొంది. దీంతో ఆమె భవిష్యత్తు చదువులకు ఆటంకం ఏర్పడే పరిస్థితి నెలకొంది.
రెండు నెలల క్రితమే తండ్రి మృతి
ఇదిలా ఉండగా, గత రెండు నెలల క్రితం ఆమె తండ్రి బయన్న గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ బాధ్యతలన్నీ ప్రస్తుతం తల్లి భుజాలపై పడ్డాయి. “కళాశాలలో చేరే సమయంలో ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదనే కారణంతో ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు.
మా వంటి అమాయక ఆదివాసీలను ఇబ్బందులకు గురి చేయకుండా అధికారులు స్పందించి సర్టిఫికెట్లు ఇప్పించాలి” అని విద్యార్థిని విజ్ఞప్తి చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య పేరుతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు నిలిపివేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
