ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యం

పెద్దకాపర్తి బీసీ హాస్టల్‌లో విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ..
ప్రభుత్వ పథకాలతో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు

చిట్యాల, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యమని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కాటం వెంకటేశం తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో ఉన్న బీసీ హాస్టల్‌ను శుక్రవారం ఉదయం సర్పంచ్ కాటం వెంకటేశం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న అల్పాహారాన్ని పరిశీలించి, వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులకు నోట్‌బుక్స్‌ను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై శ్రద్ధతో ఉదయం రాగిజావ, స్నాక్స్‌తో పాటు పోషకాహారం అందిస్తున్నారని, మధ్యాహ్న భోజనంలో గుడ్డు, చికెన్ వంటి పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో బీసీ హాస్టల్ వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, హాస్టల్ వార్డెన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.