పాముకాటుతో గిరిజన మహిళ మృతి

సకాలంలో వైద్యం అందలేదని కుటుంబ సభ్యుల ఆరోపణ..
తల్లిని కోల్పోయిన 9 నెలల చిన్నారి

కడెం, ఆంధ్ర‌ప్ర‌భ : నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్దూర్ కొలం గూడెంలో విషాదం చోటుచేసుకుంది. పాముకాటుకు గురైన కొలం గిరిజన మహిళ అత్రం రాంబాయి (21) చికిత్స పొందుతూ మృతి చెందింది. సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే తన భార్య మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. వివరాల ప్రకారం.. పెద్దూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కొలం గూడెంకు చెందిన అత్రం రాంబాయి గురువారం రాత్రి ఇంట్లో నేలపై నిద్రిస్తుండగా పాము కాటుకు గురైంది. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు.

అనంతరం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించాలని సూచించడంతో కుటుంబ సభ్యులు ఆమెను తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. రాంబాయి మృతితో పెద్దూర్ కొలం గూడెంలో విషాదం నెలకొంది. మృతురాలికి భర్త సంతోష్‌తో పాటు 9 నెలల కుమారుడు ఉన్నాడు. తల్లిని కోల్పోయిన చిన్నారిని చూసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపణలు
నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సకాలంలో వైద్యం అందించి ఉంటే రాంబాయి ప్రాణాలు దక్కేవని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆమె మృతి చెందిందని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా వైద్యశాఖ నుంచి ఎలాంటి స్పందన వెలువడలేదు. కాగా, పెద్దూర్ కడెం గ్రామ సర్పంచ్ దీకొండ విజయ్‌కుమార్, ఉప సర్పంచ్ పిట్టల రాజన్న, వార్డు సభ్యుడు అత్రం శ్రీనివాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్, ఉట్నూర్ ఐటీడీఏ పీవోను కోరుతున్నారు.