4-Spot-Dead : కడసారి చూపు దక్కలే Andhra Prabha Sad News
4-Spot-Dead : కడసారి చూపు దక్కలే Andhra Prabha Sad News
- దారి మధ్యలోనే ..
- నలుగురు అక్కడికక్కడే
- మాచర్లలో ఘోర ప్రమాదం
- ఆగిన లారీని ఢీకొన్న తుఫాన్
- నిద్రమత్తే కారణమా?
- నలుగురు హైదరాబాదీలు మృతి
- ముగ్గురు చిన్నారల పరిస్థితి విషమం
- నాగిరెడ్డిపల్లె కన్నీరు మున్నీరు
( మాచర్ల / పల్నాడు ప్రతినిధి , ఆంధ్రప్రభ.)
మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఒకరి మరణాన్ని ఓదార్చడానికి, ఆ కడసారి చూపు కోసం బయలుదేరిన ఆ కుటుంబాలను మార్గమధ్యంలోనే విధి వంచించింది. బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తున్న వారి వాహనాన్ని మృత్యువు లారీ రూపంలో ముంచేసింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకేసారి నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఆయా కుటుంబాల్లో తీరని గుండెకోత మిగిలింది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ పరిధిలో తెల్లవారుజామున జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
4-Spot-Dead : కన్నీటి ప్రయాణం.. మధ్యలోనే
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలోని వెనిగండ్ల మండలం నాగిరెడ్డిపల్లె గ్రామానికి ఒకే కుటుంబానికి చెందిన బంధువులు తుఫాను వాహనంలో బయలుదేరారు. తమకు అత్యంత ఆప్తుడైన ఓ బంధువు మరణించాడనే వార్త వినడమే ఆ కుటుంబాలకు మొదటి గుండెకోత. ఎలాగైనా చివరి చూపు చూసుకోవాలనే ఆరాటంతో, కన్నీళ్లను గుండెల్లో దాచుకుని అర్ధరాత్రి ప్రయాణమయ్యారు. డ్రైవర్‌తో కలిపి మొత్తం 13 మంది ఆ వాహనంలో ఉన్నారు. మరో కొన్ని గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటారనగా.. తెల్లవారుజామున మాచర్ల పట్టణ శివారులోని నగర వనం సమీపంలో, మండాది రోడ్డుపై ఆగి ఉన్న ఓ లారీని వీరి తుఫాను వాహనం అత్యంత వేగంగా ఢీకొట్టింది. చీకటి, అలసట, డ్రైవర్ కనురెప్ప వేయడం వల్లో లేదా మరే ఇతర కారణమో కానీ.. ఆ ప్రమాదం వారి జీవితాలను చీకటి చేసింది.
4-Spot-Dead : అక్కడి కక్కడే నలుగురు
ప్రమాదం జరిగిన తీవ్రతకు వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. తెల్లవారుజామున ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా క్షతగాత్రుల ఆర్తనాదాలు, పిల్లల కేకలతో మారుమోగిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు ఘటనా స్థలంలోనే అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులను కదిరి వెంకటేశ్వర్లు, కదిరి శారద, పిడుగు సత్యనారాయణ, పిడుగు శారదగా గుర్తించారు. రెండు కుటుంబాల్లోని ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు మరణించడంతో ఆ బంధుత్వాల మధ్య విషాద నీడలు అలుముకున్నాయి. ఒకరి మృతితో పరామర్శకు వెళ్తూ.. తామే అనంత లోకాలకు తరలిపోవడం చూసిన వారిని కన్నీరు పెట్టించింది.
4-Spot-Dead చిన్నారుల పరిస్థితి విషమం.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించారు. 108 వాహనం ద్వారా క్షతగాత్రులందరినీ తక్షణమే మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు పసిపిల్లలు కూడా ఉన్నారు. వారి శరీరాలపై అయిన గాయాలు, కళ్ల ముందే జరిగిన ఈ భయానక దృశ్యం వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. మాచర్ల ఆసుపత్రిలో వైద్యాధికారులు వారికి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే చిన్నారులతో పాటు మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం వారిని పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి కొందరు, మరికొందరిని ప్రైవేట్ ఆసుపత్రి కి తరలించినట్లు వైద్యులు వెల్లడించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం, మరికొందరు ఆసుపత్రి బెడ్‌పై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండటంతో నాగిరెడ్డిపల్లె గ్రామంలో తీవ్ర శోకసంద్రం నెలకొంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
