అర్హులైన ఒక్క ఓటరూ మిస్ కాకూడదు..

  • జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

జుక్కల్/కామారెడ్డి, ఆంధ్రప్రభ : జుక్కల్ నియోజకవర్గంలో అర్హులైన ఒక్క ఓటరు కూడా మిస్ కాకుండా కాంగ్రెస్ శ్రేణులు చర్యలు తీసుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో కీలకమైన ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణలో తమవంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

జుక్కల్ నియోజకవర్గంలోని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ ప్రక్రియ సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు పలు సూచనలు చేశారు.

ప్రతి అర్హ పౌరుడికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పటికే ఉన్న ఓటు హక్కును పరిరక్షించడంతో పాటు, కొత్తగా అర్హత సాధించిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారాలు నింపే ప్రక్రియలో ప్రజలకు సహకారం అందించాలని, బీఎల్‌వోలు, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు.

నియోజకవర్గంలో బీఎల్‌వోలు చురుకుగా విధులు నిర్వహిస్తున్నారని, ఓటు హక్కు అమూల్యమైనదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతం కావడానికి ప్రజలు కూడా తమవంతు సహకారం అందించాలని కోరారు.