టీజీ20 లీగ్ విజేతలకు సీఎం రేవంత్ అభినందనలు

  • హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టుకు చెక్కుల ప్రదానం..
  • క్రీడా రంగానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం

హైదరాబాద్, ఆంధ్రప్రభ : టీజీ20 లీగ్ విజేతలైన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు సభ్యులు గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజేతలను అభినందించిన సీఎం, జట్టు సభ్యులకు విజేతల చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం క్రీడా రంగ అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యం పెంచే లక్ష్యంతో కొత్త స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని సీఎం వెల్లడించారు.

గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి అవసరమైన శిక్షణ, మౌలిక వసతులు, ప్రోత్సాహం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. టీజీ20 లీగ్‌లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు రాష్ట్ర యువతకు ఆదర్శంగా నిలవాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి తెలంగాణకు పేరు తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు.