వేతన సవరణపై తేల్చండి.. లేకపోతే ఆందోళనలు తప్పవు

  • 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా దశలవారీ ఆందోళన
  • 31న విజయవాడలో సామూహిక ధర్నా
  • హైకోర్టు కేసులతో వేతన సవరణను ముడిపెట్టొద్దు
  • జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీనియర్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎన్. రంగబాబు

విజయవాడ, ఆంధ్రప్రభ: జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల (డీసీసీబీలు) సీనియర్ అధికారుల వేతన సవరణను తక్షణమే అమలు చేయాలని కోరుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల సీనియర్ ఆఫీసర్ల అసోసియేషన్ (ఏపీసీసీబీఓఏ) దశలవారీ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీనియర్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎన్. రంగబాబు ఒక ప్రకటనలో తెలిపారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 17వ తేదీ నుంచి డిమాండ్స్ బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారు. 20 నుంచి 24వ తేదీ వరకు భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తారు. 27వ తేదీన సామూహిక సెలవు పాటించడంతో పాటు, 31వ తేదీన సామూహిక సెలవుతో విజయవాడలో ధర్నా నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో పనిచేస్తున్న మూడు వేలకుపైగా ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేసినప్పటికీ, కేవలం 60 మంది సీనియర్ అధికారులు అయిన సీఈఓలు, జనరల్ మేనేజర్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్ల వేతన సవరణను మాత్రమే పెండింగ్‌లో ఉంచడం విచారకరమని ఎన్. రంగబాబు పేర్కొన్నారు.

2023లో డీసీసీబీల స్వయం ప్రతిపత్తికి వ్యతిరేకంగా అప్పటి ప్రభుత్వం చేపట్టిన సీనియర్ అధికారుల అంతర్‌జిల్లా బదిలీలపై హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను ఉపసంహరించుకుంటేనే వేతన సవరణ చేపడతామని యాజమాన్యం చెప్పడం శోచనీయమని ఆయన విమర్శించారు. ఉద్యోగుల న్యాయమైన వేతన హక్కులను కోర్టు కేసులతో ముడిపెట్టడం సరికాదన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం సానుకూలంగా స్పందించి సీనియర్ అధికారుల వేతన సవరణను వెంటనే అమలు చేయాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీనియర్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎన్. రంగబాబు కోరారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. జగదీష్, కార్యనిర్వాహక అధ్యక్షుడు సీహెచ్. అజేయ్ కిషోర్, ముఖ్య ఉపాధ్యక్షుడు కే. విజయ్ చంద్రారెడ్డి, కోశాధికారి కె. జయలక్ష్మి కూడా ఈ డిమాండ్‌కు మద్దతు తెలిపారు.