సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటుపై హెచ్‌ఎంఎస్–తెలంగాణ రక్షణ సేన హర్షం
జూలై 17, 18 తేదీల్లో మెడికల్ బోర్డు నిర్వహణకు యాజమాన్యం నిర్ణయం.. ఇది కార్మికుల విజయమని ప్రకటన
హైదరాబాద్, ఆంధ్రప్రభ: సింగరేణి సంస్థలో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలన్న తమ డిమాండ్ నెరవేరిందని హెచ్‌ఎంఎస్, తెలంగాణ రక్షణ సేన నాయకులు పేర్కొన్నారు. గాంధేయ మార్గంలో చేపట్టిన తమ సంయుక్త ఉద్యమానికి ఫలితంగానే సింగరేణి యాజమాన్యం ఈ నెల 17, 18 తేదీల్లో మెడికల్ బోర్డును నిర్వహించాలని నిర్ణయించిందని వారు తెలిపారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో, మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకుండా నెలల తరబడి కాలయాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం చివరకు తమ ఉద్యమానికి స్పందించాల్సి వచ్చిందని ఆరోపించారు. మెడికల్ బోర్డు నిర్వహణ నిర్ణయం వేలాది మంది సింగరేణి కార్మికుల విజయమని పేర్కొన్నారు.
అనారోగ్య కారణాలతో మెడికల్ అన్‌ఫిట్ కోసం వేలాది మంది కార్మికులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, మెడికల్ బోర్డు ఏర్పాటు ఆలస్యం కావడంతో వారు తీవ్ర మనోవేదనకు గురయ్యారని తెలిపారు. ఇప్పుడు బోర్డు ఏర్పాటు చేయడం స్వాగతించదగ్గ నిర్ణయమే అయినప్పటికీ, ఇలాంటి ప్రక్రియను ఒక్కసారి నిర్వహించడం కాకుండా ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించే విధంగా శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు హక్కు అని హెచ్‌ఎంఎస్, తెలంగాణ రక్షణ సేన నాయకులు పేర్కొన్నారు. మెడికల్ అన్‌ఫిట్‌గా ప్రకటించబడిన కార్మికులు సూచించే అర్హులైన కుటుంబ సభ్యులకు వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని కోరారు.
అలాగే, మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికుల దరఖాస్తులను నిబంధనల మేరకు వేగంగా పరిశీలించి, అర్హులైన వారికి ఆలస్యం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని యాజమాన్యాన్ని కోరారు. కార్మికుల సంక్షేమం, వారసత్వ ఉద్యోగాల అంశంలో ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం మరింత సానుకూలంగా వ్యవహరించాలని హెచ్‌ఎంఎస్–తెలంగాణ రక్షణ సేన విజ్ఞప్తి చేశాయి.
