లంచం ఇస్తేనే విద్యుత్ లైన్ క్లియర్..?

లంచం ఇస్తేనే విద్యుత్ లైన్ క్లియర్..?

  • సంవత్సరం గడిచినా స్పందించని విద్యుత్ అధికారులు
  • మూడు నెలల క్రితమే స్తంభాలు ఏర్పాటు చేసినా వైర్లు బిగించని పరిస్థితి
  • కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని బాధిత కుటుంబం ఆవేదన..

ఎల్కతుర్తి, (ఆంధ్రప్రభ): విద్యుత్ కనెక్షన్ కోసం డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) చెల్లించి ఏడాది గడిచినా అధికారులు స్పందించకపోవడంతో ఓ బాధిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. మూడు నెలల క్రితమే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటివరకు వైర్లు బిగించి విద్యుత్ లైన్ ఇవ్వకపోవడంపై సంబంధిత అధికారుల తీరును ప్రశ్నిస్తోంది.

మండలంలోని చింతలపల్లె గ్రామానికి చెందిన వృద్ధురాలు మైస లసుమమ్మ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, 2025 డిసెంబర్ 17న ఆన్‌లైన్ ద్వారా విద్యుత్ కనెక్షన్ కోసం డీడీ నమోదు చేశారు. అనంతరం 2026 ఏప్రిల్–మే నెలల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసినప్పటికీ, మూడు నెలలు గడిచినా ఇప్పటివరకు విద్యుత్ వైర్లు బిగించి కనెక్షన్ ఇవ్వలేదని తెలిపారు.

ఈ విషయమై విద్యుత్ కార్యాలయానికి పలుమార్లు వెళ్లినా అధికారులు “కాంట్రాక్టర్ అందుబాటులో లేడు”, “రేపు పంపిస్తాం”, “ఎల్లుండి పంపిస్తాం” అంటూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్‌లో ఉండడం లేదా కాల్స్ ఎత్తకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వృద్ధురాలి మనవడు మైస శ్రీకాంత్ తెలిపారు. గత పది రోజులుగా ప్రతిరోజూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సమస్యకు పరిష్కారం లభించలేదని వాపోయారు.

తమ కంటే తర్వాత డీడీ చెల్లించిన అదే గ్రామానికి చెందిన పలువురికి ఇప్పటికే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి లైన్ కూడా ఇచ్చారని, తమ విషయంలో మాత్రం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.

“లంచం ఇస్తేనే విద్యుత్ లైన్ క్లియర్ అవుతుందా?” అంటూ బాధిత కుటుంబం ప్రశ్నిస్తోంది. సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని విద్యుత్ లైన్ ఏర్పాటు చేసి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.