రైతుల నిరసనకు ముందే మాజీ ఎమ్మెల్యే మెచ్చా హౌస్ అరెస్ట్

దమ్మపేట, (ఆంధ్రప్రభ): రైతుల సమస్యలపై నిరసన చేపట్టేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు గురువారం ముందస్తు చర్యలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపు మేరకు నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి మెచ్చా నాగేశ్వరరావును దమ్మపేట మండలం తాటిసుబ్బన్నగూడెంలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే పలువురు బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు.

ఈ సందర్భంగా మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ, రైతుల సమస్యలపై ప్రశ్నిస్తారనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులు మణుగూరుకు వస్తున్న సమయంలో రైతుల సమస్యలను ప్రస్తావించకుండా అడ్డుకునేందుకే ముందస్తు అరెస్టులు చేశారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కోరడం ప్రజాస్వామ్య హక్కు అని, ప్రశ్నించే గొంతులను కేసులు, అరెస్టులతో అణచివేయాలని చూడడం సరైంది కాదన్నారు. ఎన్ని అరెస్టులు చేసినా ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.

ముందస్తు అరెస్టులకు గురైన వారిలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు సోయం వీరభద్రం, రావుల శ్రీనివాసరావు, గాజుబోయిన ఏసుబాబు, అబ్దుల్ జిన్నా, దారా రమేష్, యార్లగడ్డ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.