ఎస్‌ఐఆర్‌పై ఈనెల 20న చౌటుప్పల్‌లో సీపీఎం ప్రాంతీయ సదస్సు
చౌటుప్పల్ (ఆంధ్రప్రభ): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎస్‌ఐఆర్ (ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియ ప్రజల్లో భయాందోళనలు, గందరగోళాన్ని సృష్టిస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అన్నారు. ఈ ప్రక్రియ కారణంగా లక్షలాది మంది ఓటర్ల పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగిపోయే ప్రమాదం ఉందని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా దీని ప్రభావం కనిపించిందని పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ, దాని ప్రభావం, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 20న చౌటుప్పల్‌లో ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
చౌటుప్పల్‌లోని పద్మావతి ఫంక్షన్ హాల్‌లో ఈ నెల 20వ తేదీ ఉదయం 10:30 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ముఖ్య వక్తగా, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును పరిరక్షించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ ప్రాంతీయ సదస్సుకు ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజాస్వామ్యవాదులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఎండి జహంగీర్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, బూరుగు కృష్ణారెడ్డి, గుంటూరు శ్రీనివాసాచారి, జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, గోశిక కరుణాకర్, రాగిరి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
