ఆంధ్ర క్రికెట్ కు గోల్డెన్ మిషన్
- డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్‌గా కళ్యాణ్ కృష్ణ..
- బాధ్యతలు స్వీకరించిన మాజీ ఐపీఎల్ క్రికెటర్ దొడ్డపనేని కళ్యాణ్ కృష్ణ..
- ఆంధ్రను దేశంలోనే అగ్రశ్రేణి క్రికెట్ శక్తిగా తీర్చిదిద్దుతాం…
- ఏపీ నుంచి ఐపీఎల్ మరింత మంది ఆటగాళ్లు…
- భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించేలా సమగ్ర కార్యాచరణ..
- ప్రతిభ గుర్తింపు, కోచింగ్, సెలక్షన్, ఆటగాళ్ల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి
- కొత్త ప్రతిభ వెలుగులోకి తెస్తున్న ఏసీఏ
- యువ క్రికెటర్లకు మరిన్ని అవకాశాలే లక్ష్యం..
- ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), కార్యదర్శి సానా సతీష్ బాబు, ట్రెజరర్ దండమూడి శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపిన కళ్యాణ్ కృష్ణ..
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌ను దేశ క్రికెట్ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టే లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ఐపీఎల్ ఆటగాడు, ఆంధ్ర జట్టుకు సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన దొడ్డపనేని కళ్యాణ్ కృష్ణను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్‌గా నియమించగా, ఆయన బుధవారం విజయవాడలోని ఏసీఏ పరిపాలనా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
రాష్ట్రం నుంచి మరింత మంది యువ క్రికెటర్లు ఐపీఎల్, భారత జాతీయ జట్టుకు చేరేలా వ్యవస్థను బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కళ్యాణ్ కృష్ణ ఆంధ్రప్రభతో ప్రత్యేకంగా మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), కార్యదర్శి సానా సతీష్ బాబు, ట్రెజరర్ దండమూడి శ్రీనివాస్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
2001 నుంచి 2011 వరకు ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు 2008, 2009 ఐపీఎల్ సీజన్లలో ఆడిన అనుభవం, దులీప్ ట్రోఫీ, దేవధర్ ట్రోఫీల్లో పాల్గొనడం, అనంతరం ఆంధ్ర జట్టుకు బౌలింగ్ కోచ్‌గా సేవలందించడం తనకు రాష్ట్ర క్రికెట్ అవసరాలపై పూర్తి అవగాహన కల్పించిందన్నారు.
రాష్ట్రంలో ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు గేమ్ డెవలప్‌మెంట్, కోచింగ్, సెలక్షన్ విధానం, ఆటగాళ్ల సంక్షేమం, ఆధునిక శిక్షణా సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలికితీసి వారికి జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.
ఇటీవల నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రాష్ట్ర క్రికెట్‌కు కొత్త ఊపు తీసుకొచ్చిందని కళ్యాణ్ కృష్ణ పేర్కొన్నారు. ఐపీఎల్‌కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో నిర్వహించిన ఏపీఎల్ ద్వారా అనేక మంది యువ ఆటగాళ్లు తమ ప్రతిభను చాటుకున్నారని, ఇలాంటి టోర్నీలను మరింత విస్తరించడం ద్వారా ఆంధ్ర నుంచి ఐపీఎల్, భారత జట్టుకు మరింత మంది ఆటగాళ్లను అందించే అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.
రాష్ట్ర క్రికెట్ అభివృద్ధే లక్ష్యంగా ఏసీఏ చేపడుతున్న కార్యాచరణలో తన అనుభవాన్ని పూర్తిస్థాయిలో వినియోగించి ఆంధ్ర జట్టును దేశంలోనే అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలబెట్టేందుకు అంకితభావంతో పనిచేస్తానని కళ్యాణ్ కృష్ణ స్పష్టం చేశారు.
