తెలంగాణ భవిష్యత్తు ప్రభుత్వ బడుల్లోనే

  • విద్యతోనే ఉజ్వల భవిష్యత్తుకు పునాది
  • దేశంలో తొలి రెండు స్థానాల్లో తెలంగాణ నిలవాలి
  • విద్యార్థులపై ఏటా రూ.1.08 లక్షల వ్యయం
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఆంధ్రప్రభ, వనపర్తి : తెలంగాణ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి నాణ్యమైన విద్య అందిస్తేనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్య ఆత్మగౌరవాన్ని పెంచడంతో పాటు జీవితాలను మార్చి, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తుందని పేర్కొన్నారు.

వనపర్తి జిల్లా కొత్తకోట బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో విద్యారంగం నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు లేక విద్యార్థుల చేరిక తగ్గిపోయిందన్నారు.

తెలంగాణ భవిష్యత్తు తరగతి గదుల్లోనే..

తమ ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని సీఎం తెలిపారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పూర్తి చేశామని చెప్పారు. విద్యాశాఖ పర్యవేక్షణకు సీనియర్ అధికారులను నియమించామని పేర్కొన్నారు. విద్యారంగంపై తనకు ఉన్న నమ్మకంతోనే విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నానని తెలిపారు. తెలంగాణ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం విద్యారంగంలో తెలంగాణ దేశంలో 18వ స్థానంలో ఉందని సీఎం పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మార్చాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధికారులందరిపైనా ఉందన్నారు. సమష్టిగా కృషి చేసి తెలంగాణను దేశంలో తొలి రెండు స్థానాల్లో నిలపాలని పిలుపునిచ్చారు.

స్వాతంత్ర్య దినోత్సవం నాటికి 27.5 లక్షల మందికి కిట్లు

యువతకు సాంకేతిక నైపుణ్యాలు అందించేందుకు పారిశ్రామిక శిక్షణ సంస్థలను అధునాతన సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు అవసరమైన సామగ్రితో కూడిన యంగ్ ఇండియా కిట్లను 27.5 లక్షల మందికి స్వాతంత్ర్య దినోత్సవం నాటికి అందించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. గ్రామీణ స్థాయి నుంచే క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి అవసరమైన శిక్షణ, అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.

ఒక్కో విద్యార్థిపై రూ.1.08 లక్షల వ్యయం

రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుని ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నానని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. విద్యార్థులు తమ సామర్థ్యంపై నమ్మకం ఉంచాలని సూచించారు. బలమైన ప్రభుత్వ పాఠశాలలే తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.