తెలంగాణ ఓటర్లకు అలర్ట్.. ‘సర్’ గడువు పొడిగింపు
- ఆగస్టు 3 వరకు ఇంటింటి సర్వే
- ఆగస్టు 10న ముసాయిదా ఓటరు జాబితా
- అక్టోబర్ 12న తుది జాబితా విడుదల
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమాచారం ఇచ్చింది. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ‘సర్’ ప్రక్రియకు సంబంధించిన గడువును పొడిగిస్తూ సవరించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం బూత్ స్థాయి అధికారులు చేపట్టే ఇంటింటి సర్వే ఆగస్టు 3 వరకు కొనసాగనుంది.
ఆగస్టు 3 వరకు ఇంటింటి సర్వే..
సవరించిన షెడ్యూల్ ప్రకారం బూత్ స్థాయి అధికారుల ఇంటింటి పరిశీలన ప్రక్రియను ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించారు. పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ, హేతుబద్ధీకరణ ప్రక్రియను కూడా అదే తేదీ నాటికి పూర్తి చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. గత షెడ్యూల్ ప్రకారం ముసాయిదా జాబితా జూలై 31న విడుదల కావాల్సి ఉండగా.. ఇప్పుడు తేదీలను మార్చారు.
ఆగస్టు 10న ముసాయిదా జాబితా
తెలంగాణ ముసాయిదా ఓటరు జాబితాను ఆగస్టు 10న విడుదల చేయనున్నారు. జాబితాలో పేరు లేకపోయినా, వివరాల్లో తప్పులు ఉన్నా ఓటర్లు క్లెయిములు, అభ్యంతరాలు సమర్పించేందుకు అవకాశం ఉంటుంది.
ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు క్లెయిములు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. వీటిని అక్టోబర్ 8లోగా అధికారులు పరిష్కరించాల్సి ఉంటుంది. అనంతరం అక్టోబర్ 12న తెలంగాణ తుది ఓటరు జాబితాను అధికారికంగా ప్రచురించనున్నారు.
సవరించిన షెడ్యూల్ ఇదే..
బీఎల్ఓల ఇంటింటి సర్వే: ఆగస్టు 3 వరకు
పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ: ఆగస్టు 3లోగా
ముసాయిదా ఓటరు జాబితా: ఆగస్టు 10
క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ: ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు
క్లెయిములు, అభ్యంతరాల పరిష్కారం: అక్టోబర్ 8లోగా
తుది ఓటరు జాబితా: అక్టోబర్ 12
ఓటర్లు ఈ అవకాశం మిస్ కావొద్దు
ఓటరు జాబితాలో తమ పేరు, ఇతర వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కొత్తగా ఓటు హక్కు పొందేందుకు అర్హులైన వారు నమోదు చేసుకోవడంతో పాటు వివరాల్లో మార్పులు, చేర్పులు అవసరమైన వారు సవరించిన గడువును వినియోగించుకోవచ్చు. ఓటరు సేవల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల సేవా పోర్టల్ అందుబాటులో ఉంది.
