నీతి, నిజాయితీలకు మారుపేరుగా.. నిలిచిన ప్రజా నాయకుడు

రాజీలేని పోరాట యోధుడు
ఆయన అకాల మరణం ఆంధ్రప్రదేశ్‌కు తీరని లోటు
మాజీ ఎమ్మెల్యే ఆవేదన


( విజయవాడ ఆంధ్రప్రభ) : రాజీలేని పోరాటయోధుడు మాజీమంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు, సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో కాపు ఉద్యమ నేత, అమరజీవి ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం రాజకీయ, సామాజిక సేవలను స్మరించుకుంటూ ఆయన భౌతికకాయానికి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం ఒక విలక్షణమైన, విశిష్టమైన నేతగా వెలుగొందారని కొనియాడారు. నీతి, నిజాయితీలకు మారుపేరుగా నిలిచిన ఆయన, తన సామాజిక వర్గ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేశారని గుర్తుచేశారు. కాపు రిజర్వేషన్ల సాధన కోసం ప్రభుత్వాలపై ఆయన చేసిన రాజీలేని పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తన వాణిని బలంగా వినిపించి, ప్రజలను ఎంతగానో ఆకర్షించిన ప్రజా హృదయ విజేత ముద్రగడ అని శ్లాఘించారు.

ఆసుపత్రి నుండి కోలుకుని ముద్రగడ తిరిగి ప్రజా సేవలోకి వస్తారని అభిమానులు, ప్రజలు ఆశించారని, కానీ ఆయన అకాల మరణం చెందడం ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మల్లాది విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ముద్రగడ కుటుంబ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శోకసముద్రంలో మునిగిపోయారని అన్నారు. ​ఇదే సమయంలో గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ముద్రగడ పద్మనాభంపై జరిగిన వేధింపులను ఆయన గుర్తుచేశారు. రిజర్వేషన్ల అంశంలో ముద్రగడను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర చిత్రహింసలకు గురిచేసిందని, ఇప్పుడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలంటూ కూటమి ప్రభుత్వం కపట ప్రేమను ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు. తన ఇంటికి వచ్చిన వారిని ఎంతో ప్రేమగా, గౌరవంగా ఆదరించే గొప్ప సంస్కస్కారం ముద్రగడ సొంతమని, నేటి తరం రాజకీయ నాయకులకు ఆయన జీవన విధానం ఆదర్శప్రాయమని విష్ణు పేర్కొన్నారు.

భౌతికంగా ఆయన మనకు దూరమైనా, ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ముద్రగడ స్థానం సుస్థిరమని, రాష్ట్ర ప్రజలకు ఆయన ఎప్పటికీ రోల్ మోడల్‌గా నిలిచిపోతారని అన్నారు. త్వరలోనే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ముద్రగడ స్వగ్రామానికి వెళ్లి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నట్లు వెల్లడించారు. ​ముద్రగడ పద్మనాభం ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్టసమయంలో వారి కుటుంబానికి ఆ కనకదుర్గమ్మ తల్లి గుండె నిబ్బరాన్ని, ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంక్షేమ కాపునాడు అధ్యక్షులు యర్రంశెట్టి అంజిబాబు, రత్నాకర్, భోగాది మురళి, రవిచంద్ర, త్రివేణి రెడ్డి, వరలక్ష్మి, యర్రంశెట్టి వెంకన్న కాపు నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.