గిరిజన యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యం
- ఉట్నూర్‌లో మెగా జాబ్ మేళా..
- 20 కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం
ఉట్నూర్, ఆంధ్రప్రభ : గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి మంద మకరందు అన్నారు. బుధవారం ఉట్నూర్‌లోని కుమ్రం భీం కాంప్లెక్స్ ప్రాంగణంలో ఉన్న యువజన శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అనంతరం వివిధ శాఖల అధికారులతో కలిసి జాబ్ మేళాను పరిశీలించారు. ఉద్యోగాల కోసం వచ్చిన యువతతో మాట్లాడి, వారికి అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాల గురించి వివరించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మంద మకరందు మాట్లాడుతూ.. గిరిజన యువత విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకుని ప్రైవేట్ రంగంలో లభిస్తున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో యువతకు ఉపాధి కల్పించేందుకు నిరంతరం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని మెగా జాబ్ మేళాలు నిర్వహించి, ఎక్కువ మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
ఈ మెగా జాబ్ మేళాలో దేశంలోని 20 ప్రముఖ కార్పొరేట్ సంస్థలు పాల్గొన్నాయి. ఆయా సంస్థల మానవ వనరుల విభాగం ప్రతినిధులు అభ్యర్థులకు ప్రత్యక్ష ఇంటర్వ్యూలు నిర్వహించారు. విద్యార్హతలు, నైపుణ్యాలు, అనుభవాన్ని పరిశీలించి అర్హులైన వారిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు.
ఇంటర్వ్యూల్లో ప్రతిభ కనబరిచి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు, జేడీఎం మేనేజర్ నాగభూషణం, ఇతర అధికారులు అక్కడికక్కడే నియామక పత్రాలను అందజేశారు. ఉద్యోగాలు సాధించిన యువతను అభినందించిన ప్రాజెక్టు అధికారి.. విధుల్లో అంకితభావంతో పనిచేసి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఏపీఓ జనరల్ వసంతరావు జాదవ్, డీడీ ప్రేమకళ, ఏపీఓ పీవీటీజీ ఆత్రం భాస్కర్, డీఎంజీసీసీ గుడిమల్ల సందీప్ కుమార్, అదనపు డీఎంహెచ్ఓ మెస్రం మనోహర్, ఈఈ తానాజీ జాదవ్, డిప్యూటీ డీఈవో గోడం చందన్, పేసా కోఆర్డినేటర్ వసంతరావు, వివిధ శాఖల అధికారులు, యువజన శిక్షణ కేంద్రం సిబ్బంది, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, ఉద్యోగార్థులు, పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొన్నారు.
